కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభ (BJP Public Meeting) ఊహించనివిధంగా సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలంగాణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారని, నాన్ ఎలక్షన్ సమయంలో కూడా భారీ జనసంద్రం కనిపించడం బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సభ విజయవంతం కావడంలో పార్టీ కార్యకర్తల అహర్నిశల శ్రమ, నాయకత్వ సమన్వయం, కార్యకర్తల నిబద్ధత ప్రధాన కారణమని అన్నారు.
సాధు సమాజం నుంచి స్వామీజీలు, బంజారా, లంబాడీ సమాజాల మహిళలు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యాయవాదులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. మహోత్సవంలా మారిన సభను చూస్తే, తెలంగాణ సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ వైపు ఆశతో చూస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయ మార్పు అనివార్యమవుతోందని రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ (PM Modi) నాయకత్వం తెలంగాణలో కొత్త రాజకీయ దిశను తీసుకురాబోతోందని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని విమర్శించారు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “మోదీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక పురోగతి” అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై బీజేపీ ఉద్యమ పంథాలో పోరాటం కొనసాగిస్తుందని, కార్యకర్తలు అధికారం లక్ష్యంగా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు.
ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన, ఇది భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్ల తొలగింపే లక్ష్యమని, అసలైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. “ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ తనను తాను ముస్లిం లీగ్ తరహా పార్టీగా మార్చుకుంటోంది అని వ్యాఖ్యానించారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని రాంచందర్ రావు ఆరోపించారు.
Read Also: తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

