కలం, వరంగల్ బ్యూరో: ఉత్తర తెలంగాణ విద్యా, సామాజిక ప్రగతికి దిక్సూచిగా నిలిచిన కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)పై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందా? ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) అభివృద్ధికి భారీగా రూ.1,000 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఐదు దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణకు ఉన్నత విద్యను అందిస్తున్న కేయూకు మాత్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కేయూ గోల్డెన్ జూబ్లీ వేళ.. వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నకాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ – కుర్తా (KURTA) డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఐదు దశాబ్దాల ఘనత.. నిధుల కొరత
కేయూ అంటే కేవలం వరంగల్లోని ఓ విశ్వవిద్యాలయం కాదు. ఉత్తర తెలంగాణలో విద్యా చైతన్యానికి కేంద్రంగా ఎదిగిన సంస్థ. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేసింది. ఎంతో మంది అధ్యాపకులు, పరిశోధకులు, మేధావులు, వివిధ రంగాల్లో రాణించిన ప్రతిభావంతులను అందించింది. అయితే కాలానుగుణంగా వర్సిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. మౌలిక వసతులు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు, విద్యార్థుల వసతుల విషయంలో ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భారీగా నిధులు కేటాయించాల్సిన తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం పట్ల విద్యావర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేక కేటాయింపులు చేయాలనే డిమాండ్
ఓయూ అభివృద్ధికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయింపునకు ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో కేయూ విషయంలోనూ అదే తరహా ప్రత్యేక కేటాయింపులు చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. ఓయూకు భారీ ప్యాకేజీ ఇవ్వడం స్వాగతించదగిన విషయమే అయినా.. ఉత్తర తెలంగాణకు కీలకమైన కేయూకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వకూడదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేయూలో తరగతి గదులు, హాస్టళ్లు, ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, గ్రంథాలయం, ఇతర మౌలిక వసతులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సాధారణ బడ్జెట్ కేటాయింపులు సరిపోవని, ప్రత్యేక ప్యాకేజీ అవసరమని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల హామీలు ఏమాయే?
గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం, విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో తీవ్రంగా విమర్శించారు. వర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే పరిస్థితిని మార్చుతామని హామీలు ఇచ్చారు. దీంతో కేయూ వర్గాలు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా కేయూ అభివృద్ధికి ప్రత్యేక నిధుల ప్రకటన లేకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో కేయూ సమస్యలను ప్రస్తావించిన కాంగ్రెస్ నాయకత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల విషయంలో ఎందుకు మౌనం వహిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గోల్డెన్ జూబ్లీకి గిఫ్ట్ ఏదీ?
కేయూ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకల వేళ, వర్సిటీకి ప్రభుత్వం ప్రత్యేక నిధుల ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కేవలం వేడుకలు నిర్వహించడం కాకుండా రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేయూను ఆధునిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రకటించాలని ‘కుర్తా’ కోరుతోంది. వర్సిటీకి ఎంత నిధులు అవసరం? ఏయే పనులు చేపట్టాలి? పరిశోధన, బోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక రూపొందించాలి? అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక ప్రకటించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.

