తెలంగాణ ‘సర్’.. ఇతర రాష్ట్రాలకు 45 లక్షల ఓటర్లు షిఫ్ట్

కలం, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Telangana SIR) ప్రక్రియలో దాదాపు 73.39 లక్షల మంది నుంచి వివరాలు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. అంటే మొత్తం ఓటర్లలో 78.30 శాతం మంది ఎన్యూమరేషన్ ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మరోవైపు 73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలు (21.70 శాతం) అన్‌కలెక్టబుల్‌ అని అధికారులు అంటున్నారు. అయితే.. వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి వెంటనే తొలగించినట్లు కాదని.. తదుపరి దశల్లో పరిశీలన, అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, ధ్రువీకరణ అనంతరం తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.

వివరాలు ఇవ్వని 73.39 లక్షల మంది ఓటర్లలో 9,22,230 మంది మరణించిన ఓటర్లు ఉన్నారు. 11,25,546 మంది గైర్హాజరు/ఆచూకీ లేని ఓటర్లు ఉన్నారు. 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారని తేలింది. 6,70,203 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓటర్లు కాగా.. 1, 02, 294 ఫారాలు ఇతర కారణాలతో అన్‌కలెక్టబుల్‌గా అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ లో 41% అందలే!

హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,35,315 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 27,76,624 ఫారాలు (58.89 శాతం) మాత్రమే బీఎల్వోలకు తిరిగి అందాయి. మరో 19,46,101 ఫారాలు (41.09 శాతం) చేరలేదు. ఇది హైదరాబాద్‌లో ఓటర్ల స్థిర నివాసంపై ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది. నగరంలో ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారం కోసం నివసిస్తున్నప్పటికీ తమ సొంత గ్రామాల్లో ఓటును కొనసాగించుకోవాలనే ధోరణి కొంతమంది ఓటర్లలో ఉందా? లేక నగరంలో చిరునామా మార్పులు, గైర్హాజరు, వలసలే ప్రధాన కారణమా? సర్ తుది దశలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ లోని నియోజకవర్గాల వారీగా భారీ తగ్గుదల

హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్ల వ్యత్యాసం కనిపిస్తున్నట్లు సర్ తాజాగా గణాంకాలు చెప్తున్నాయి.

నియోజకవర్గం         తగ్గుదల

జూబ్లీహిల్స్            1,79,749
యాకుత్‌పురా          1,55,252
చాంద్రాయణగుట్ట    1,49,365
మలక్‌పేట్             1,47,552
కార్వాన్                 1,42,016
ముషీరాబాద్          1,40,381

రంగారెడ్డి జిల్లాలోనూ భారీ ప్రభావం..

రంగారెడ్డి జిల్లాలో 38,99,743 మంది ఓటర్లు ఉండగా, అందులో 12,86,720 ఓట్లు (34.78 శాతం) తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. అత్యధిక ప్రభావం గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లోనే కనిపిస్తోంది. మహేశ్వరం – 3.35 లక్షలు, శేరిలింగంపల్లి – 3.29 లక్షలు, ఎల్‌బీనగర్ – 2.70 లక్షలు, రాజేంద్రనగర్ – 2.47 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉంది. ఈ నియోజకవర్గాలన్నీ హైదరాబాద్ మహానగర విస్తరణతో బలంగా అనుసంధానమై ఉన్న ప్రాంతాలే. ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగం, విద్య, వలసలు వంటి కారణాలతో ఇక్కడ జనాభా మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో 29,79,130 ఓటర్లు ఉండగా, సుమారు 10,73,705 ఓట్లు తగ్గే పరిస్థితి ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే.. కుత్బుల్లాపూర్ – 2.77 లక్షలు, ఉప్పల్ – 2.18 లక్షలు, మేడ్చల్ – 2.13 లక్షలు డిలీట్ అయ్యే చాన్స్ కనిపిస్తున్నది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి మూడు జిల్లాల్లో కలిపి 43.06 లక్షల ఓట్లపై ప్రభావం పడనుంది. సర్కు ముందు ఈ మూడు జిల్లాల్లో 1,14,15,542 ఓట్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం: హైదరాబాద్ – 19,46,101, రంగారెడ్డి – 12,86,720, మేడ్చల్–మల్కాజ్‌గిరి – 10,73,705.. ఇలా మొత్తం 43,06,526 ఓట్లు తగ్గే జాబితాలో ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

Also Read : 51 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? హకీ ప్రపంచకప్‌పై భారత్ గురి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>