కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రెండు భారీ ట్రంప్ టవర్స్ (Trump Towers Hyderabad) నిర్మాణం కానున్నాయి. అమెరికా కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్ ఎవెన్యూ’ ఉండగా.. కోకాపేటలో ‘ట్రంప్ టవర్స్’ పేరుతో సుమారు రూ. 3,250 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టు వస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ట్రంప్ ఆర్గనైజేషన్’తో ఈ ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆయన మీద అభిమానంతో, ఆ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఇనుమడింపజేసేలా ట్రిబెకా అనే సంస్థ, ఐరా రియాలిటీ అనే మరో సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఈ జంట భవనాలను నిర్మిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడైన జూనియర్ ట్రంప్ (ఎరిక్ ట్రంప్)తో కలిసి ప్రముఖ ‘వార్టన్ స్కూల్’లో చదివిన ట్రిబెకా సంస్థ వ్యవస్థాపకుడు కప్లేష్ మెహతా దీనికి పూనుకున్నారు. ఆయన దాదాపు 13 ఏండ్ల పాటు ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో పనిచేశారు. ట్రంప్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కప్లేష్ మెహతా ఇప్పటికే గుర్గావ్‌లో 51 అంతస్తులతో కూడిన రెండు రెసిడెన్షియల్ టవర్స్ నిర్మించారు. నోయిడా, ముంబై, పుణె, కోల్‌కతా నగరాల్లోనూ ఇలాంటివి నిర్మిస్తున్నారు. ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ పేరుతో రెండు బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ టవర్స్కు శ్రీకారం చుడుతూ సౌత్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోనే అతి ఎత్తయినవి!
ట్రంప్ బ్రాండ్ ప్రాజెక్ట్ రంగంలో పుష్కర కాలాన్ని పూర్తిచేసుకున్న ట్రిబెకా సంస్థ కోకాపేటలోని ‘గోల్డెన్ మైల్’లో లగ్జరీ అపార్టమెంట్లను నిర్మిస్తున్నది. ట్రిపుల్ బెడ్‌రూమ్ మొదలు 6 బీహెచ్‌కే, డూప్లెక్స్ ఫ్లాట్‌లను ఈ ట్విన్ టవర్స్లో కడుతున్నది. రెండు టవర్లను కలిపేలా 28వ అంతస్తు దగ్గర సస్పెండెడ్ బ్రిడ్జిని, దానిపైన ఒక క్లబ్‌ను నిర్మిస్తున్నది.
డబుల్ హైట్ సీలింగ్ ఫ్లాట్‌లు, సింప్లెక్స్ రెసిడెన్సీలు కూడా ఉంటాయని ఐరా రియాలిటీ ఫౌండర్ నర్సిరెడ్డి మీడియాకు వివరించారు. ప్రతీ ఫ్లాట్‌కు ఒక ప్రైవేట్ లిఫ్ట్ లాబీ, కంప్లీట్ గ్లాస్ విండోస్ ఉంటాయని, పోడియంలలో అదనపు సౌకర్యాలుంటాయన్నారు.
ఇప్పటికే తెలంగాణ ‘రెరా’తో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వివరించిన నర్సిరెడ్డి.. ‘ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ రూపంలో ఆహ్వానాలు పలుకుతున్నామని, లాంఛనంగా ఫ్లాట్ల సేల్స్ ప్రారంభం కావడానికి ముందే ఇప్పుడు బుక్ చేసుకున్నవారికి ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. దశాబ్ద కాలంలో దేశంలోని ఏ నగరంతో పోల్చినా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇలాంటి ట్విన్ టవర్స్ అర్హత హైదరాబాద్కే ఉందని ఆయన తెలిపారు.
2031 నాటికి పూర్తి..
కోకాపేటలో ట్రంప్ ట్విన్ టవర్స్ను 2031 సంవత్సరంకల్లా పూర్తి చేయాలన్నది డెవలపర్ల లక్ష్యం. ఐరా రియాలిటీ సంస్థ హైదరాబాద్‌లో 2019 నుంచి 15 లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పటికే 50 లక్షల చ.అ విస్తీర్ణంలోని ప్రాజెక్టును డెలివరీ చేయగా మరో 200 లక్షల చ.అ మేర డెవలప్‌మెంట్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు ఆ సంస్థ ఫౌండర్ అయిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యావేత్త నర్సిరెడ్డి తెలిపారు. కోకాపేటలోని ట్రంప్ ట్విన్ టవర్స్ సుమారు 4.05 ఎకరాల్లో నిర్మిస్తున్నామని 16,389 చ.మీ. మేర నిర్మాణం ఉంటుందన్నారు.
ఒక్కో టవర్ నాలుగు బేస్‌మెంట్ (సెల్లార్), గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం 65 అంతస్తుల్లో, 243 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అల్ట్రా లగ్జరీ, లో-డెన్సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా పిలుచుకునే ఈ టవర్లలో ట్రిపుల్ బెడ్‌రూమ్‌తో పాటు 3.5 బీహెచ్‌కే, 4, 4.5, 5, 6 బీహెచ్‌కే ఫ్లాట్లు దాదాపు 460 ఉంటాయి. ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ 3,600 చ.అ.తో మొదలై 6 బీహెచ్‌కే 12 వేల చ.అ. వరకు ఉంటాయి. ధరల ప్రకారం చూస్తే 3 బీహెచ్‌కే ఐదున్నర కోట్లతో మొదలై 6 బీహెచ్‌కే రూ. 18 కోట్ల వరకు ఉండొచ్చని నర్సిరెడ్డి సూచనప్రాయంగా తెలిపారు.
హైదరాబాద్‌కు తేవడం సంతోషకరం: జూ. ట్రంప్
హైదరాబాద్ లోని కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మాణంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జూనియర్ ట్రంప్ (ఎరిక్ ట్రంప్) స్పందించారు. “ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజకరమైన లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఇండియా ఒకటి. ట్రంప్ బ్రాండ్‌ను ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కు తీసుకురావడం చాలా ఆనందకరం. అసాధారణమైన ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్టును అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రతిష్టాత్మకమైన చిరునామాల్లో ఒకటిగా ట్రంప్ టవర్స్ నిలుస్తుంది. ఇండియాలో నిర్మించిన ప్రతీ ట్రంప్ టవర్ ఇప్పటికే ప్రిస్టీజియస్ అడ్రస్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ ఒక మార్కెట్. దేశంలోనే అతి పెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ మార్కెట్లలో హైదరాబాద్ ఉంది. రెండు టవర్లు ఆకాశంలో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి” అని ఆయన సందేశం పంపారు.

