కలం, తెలంగాణ బ్యూరో: స్మార్ట్ రేషన్ కార్డులతో (Ration Card Distribution) ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు మంత్రి పలు సూచనలు చేశారు.
3.43 కోట్ల మందికి ఆహార భరోసా
రాష్ట్రంలో ప్రస్తుతం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 16.32 లక్షల కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా 61.09 లక్షల మంది కొత్తగా ఆహార భద్రత పరిధిలోకి వచ్చారని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాస్తవ లబ్ధిదారులను గుర్తించి వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు.
రూ.34 వేల కోట్లకు పైగా వ్యయం
ఆహార భద్రత పథకం అమలుకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
విస్తృత ప్రచారానికి ఆదేశాలు
ఆహార భద్రత పథకం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. ‘1.06 కోట్ల కార్డులు–3.43 కోట్ల లబ్ధిదారులు–ఉచిత సన్నబియ్యం’ అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

