కేంద్ర మంత్రుల‌కు పొన్నం ప్ర‌భాక‌ర్ లేఖ‌

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంద‌ని పేర్కొంటూ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) కేంద్ర మంత్రులు బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిల‌కు లేఖ రాశారు. ఎన్నికల వేళ కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాద‌ని, తెలంగాణ హక్కు అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేద‌ని ప్ర‌శ్నించారు.

పార్లమెంట్‌లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాణకు రావాల్సిన నిధులు ,పెండింగ్ ప్రాజెక్ట్‌ల‌పై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాల‌ని పొన్నం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నార‌ని, దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో సగం నిధులైనా కేంద్రం తెలంగాణకి ఇవ్వాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు అని, రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష చూపొద్ద‌ని, బండి, కిష‌న్ రెడ్డి కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాల‌ని సూచించారు.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నార‌ని పొన్నం (Ponnam Prabhakar) విమ‌ర్శించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని లక్ష్యాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటలో న్యాయం చేయాల‌ని కోరారు. కేంద్ర ప్రయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటుంద‌ని, తద్వారా రాష్ట్రాల మీద భారాలు మోపుతున్నార‌ని వెల్ల‌డించారు. కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్రం వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాల‌ని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు కేంద్రం నామమాత్రంగా ఇస్తున్నద‌ని, ఆయా మొత్తాలను పెంచాల‌ని, పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాల‌ని కోరారు. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేద‌న్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర‌మైన‌ తెలంగాణకు కేంద్రం చేయుతనందించాల‌న్నారు.

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ ఫేజ్ 2కు రూ.24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంద‌ని, దీనికి కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంద‌న్నారు. మూసీ నది పునరుద్ధరణ (Musi Rejuvenation) ప్రాజెక్ట్ అభివృద్ధి, నది శుద్ధి, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర సహాయం కావాల‌న్నారు. హైదరాబాద్ చుట్టూ 330 కి.మీ భారీ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కొంత అనుమతి వచ్చినా, దక్షిణ భాగం ఇంకా పెండింగ్‌లో ఉంద‌ని తెలిపారు. హైదరాబాద్ – వరంగల్ హైద‌రాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి పూర్తి ఆమోదం అవసర‌మ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కర్మాగారం హామీ ఇప్పటికీ అమలు కాలేద‌న్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కాలేద‌న్నారు. 2013 లో ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణకు ప్రకటించాల‌ని, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వర‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణలో అనేక రోడ్లు జాతీయ రహదారులుగా ప్రకటించాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, తెలంగాణలో మరో ఎయిమ్స్ స్థాయి మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామప్ప, యాదాద్రి ఆలయాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాల‌ని కోరారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనైనా న్యాయండ చేయాల‌ని కోరారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేద‌ని, ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడం లేద‌ని విమ‌ర్శించారు.

Read Also: ఇరాన్ బాంబు దాడిలో నిజామాబాద్ వాసికి తీవ్ర గాయాలు

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>