కలం, నిజామాబాద్ బ్యూరో: గల్ఫ్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వలస కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబసభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన కోయల్కర్ తిరుపతి ఇజ్రాయిల్‌లోని కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు.
తిరుపతి ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో కమ్మర్ పల్లి (Kammarpally) లోని స్నేహితులతో మాట్లాడిన అరగంట తర్వాత తాను పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో బాంబు (Bomb Blast) పడింది. దీంతో ఆ ధాటికి కారు అద్దాలు పగిలి తిరుపతి దవడ, గొంతు భాగంలో గుచ్చుకున్నాయి. ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్ లో రెండు వేల మంది వరకూ నిజామాబాద్ (Nizamabad) జిల్లా కార్మికులు పని చేస్తుండటంతో ఆందోళన నెలకొంది.
వాస్తవానికి ఇజ్రాయెల్‌లో (Israel) రాడార్ రక్షణ వ్యవస్థ ఉంటుంది. మిస్సైల్స్ డ్రోన్ల దాడి జరిగినా గాల్లోనే పేల్చేస్తుంది. ఇప్పటివరకూ యుద్ధం జరిగిన ప్రతిసారీ ఇజ్రాయెల్‌లో ప్రాణ నష్టం తక్కువగా జరిగింది. పైగా అలారం వ్యవస్థ కూడా ఉంటుంది. వెంటనే బంకర్లలోకి వెళ్లిపోతారు. కానీ ఇరాన్ మిస్సైల్స్ వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వలస కార్మికుల్లో భయం నెలకొంది.
Read Also: ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయాలి : వేముల ప్రశాంత్ రెడ్డి
Follow Us On: Facebook

