కలం, వెబ్ డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నియామకాలపై కోర్టు పర్యవేక్షణలో సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొంది సుమారు 3.5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడింది. పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే ఏజెన్సీకి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తం చేసింది.
నీట్ పరీక్ష వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తప్పుకున్న ఉదాహరణను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) గుర్తుచేశారు. వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నారా లోకేశ్‌ను కాపాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర గవర్నర్‌కు డిజిటల్ ఆధారాలు, వందలాది పత్రాలతో కూడిన ఫిర్యాదులను అందజేసినట్లు వైఎస్సార్‌సీపీ వెల్లడించింది.

