కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతమైతే కేవలం సిబ్బందిపైనే కాకుండా, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ (Collector Ankit) స్పష్టం చేశారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీఓలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహార నాణ్యత విషయంలో పూర్తి బాధ్యత ఆయా విభాగాల అధికారులదేనని ఆయన తేల్చి చెప్పారు.
మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో జరిగిన అస్వస్థత ఘటనపై కలెక్టర్ (Collector Ankit) విచారం వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఇంటి నుండి తెచ్చిన మాంసాహార పదార్థాలు తీసుకోవడం వల్లే అనారోగ్యం పాలయ్యారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఆర్‌సీఓ లు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆహార భద్రత కమిటీ సభ్యులు వండిన పదార్థాలను స్వయంగా రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దశలోనూ ఆహారం పరిశుభ్రంగా, పోషక విలువలతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తులో పొరపాట్లు జరిగితే బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: ఆ దేశంలో బంగారం ధరలు భారీగా పతనం
Follow Us On : WhatsApp

