కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడుతున్నది. విజిలెన్స్ తనిఖీలు మొదలుపెట్టిన రెండురోజుల్లో రూ.65 కోట్ల బియ్యం మాయమైనట్టు తేలింది. అన్ని మిల్లుల్లో సోదాలు జరిపితే ఈ లెక్క ఇంకెంత ఉంటుందోనన్న అనుమానం తలెత్తుతున్నది. ప్రభుత్వం ప్రతిఏటా కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం మిల్లులకు ధాన్యం కేటాయించడం.. మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బియ్యం అప్పగించకపోవడం.. రూ.కోట్ల విలువైన సీఎంఆర్‌ను పక్కదారి (Nizamabad CMR Scam) పట్టించడం.. షరా మామూలుగా మారిపోయింది. జిల్లాలో గత పదేళ్లలో రూ.270 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించగా, ఇప్పటికీ రికవరీ కాలేదు.
2.34 క్వింటాళ్లు గాయబ్
గత యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. నిజామాబాద్ నగర శివారు కాలూర్ గ్రామ పరిధిలో ఉన్న సిద్ధిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా 3,15,970 క్వింటాళ్లకు గాను 1,12,282 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయి. మిగతా 2.03 లక్షల క్వింటాళ్ల బియ్యం అందుబాటులో లేవని తేలింది. దీని విలువ రూ.58 కోట్లుగా అంచనా వేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లుల్లో రూ.7.5 కోట్ల విలువైన 31 వేల క్వింటాళ్ల బియ్యం లేవని తేల్చారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు కేటాయిస్తుండగా.. మిల్లర్లు బియ్యాన్ని తిరిగి సర్కార్‌కు అప్పగించకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇది షరా మామూలుగా మారింది. ఏటా కేసులు నమోదవుతున్నా మిల్లర్లలో మార్పు కనిపించడం లేదు. ఏటేటా వందల కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయి.
గత సీజన్లో 2.20 లక్షల టన్నులు పెండింగ్
2024-25 రబీ, ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. వారు ఇంకా 2.20 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిసారి గడువు పెంచడం మినహా కఠిన చర్యలేవీ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు చేపట్టారు. వర్ని మండలం పెగడపల్లికి చెందిన రాఘవేంద్ర రైస్ మిల్లులో రూ.20.20 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయి ఉండగా పీడీ యాక్ట్ ప్రయోగించారు.
పకడ్బందీ చర్యలేవీ?
వాస్తవానికి సీఎంఆర్‌కు సంబంధించి మిల్లుల్లో రెవెన్యూ సిబ్బంది, అదనపు కలెక్టర్లు నిరంతర తనిఖీలు చేపట్టాలి. తేడా వచ్చిన చోట చర్యలు చేపట్టాలి. కానీ, తనిఖీల ఊసే లేకుండా పోయింది. గత సీజన్లో సీఎంఆర్ బకాయిలు అలా ఉండగానే.. మళ్లీ ధాన్యాన్ని కేటాయిస్తుండటంతో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి సివిల్ సప్లై జీఎం కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్రమార్కులకు ఆపన్నహస్తం అందించాడని ఆరోపణలు వచ్చాయి.. విచారణ జరిగింది.. సస్పెండ్ చేశారు. కానీ నాలుగు నెలల కిందట రూ.2.40 కోట్ల విలువైన 6,665 టన్నుల బియ్యాన్ని కాజేయగా.. దీని వెనుక ఉన్న మిగతా బాధ్యులపై చర్యల ఊసే లేదు.
పదేళ్ల బకాయిలు అట్లనే..
2022 – 23కు చెందిన సీఎంఆర్ ధాన్యం బియ్యంగా ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం వేలం వేసింది. నిజామాబాబ్ ఉమ్మడి జిల్లాలో రూ.170 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు అవకాశం ఇచ్చిన అనంతరం ఆగస్టు 3న అధికారులు తుది గడువు విధించారు. గత ఏడాది ధాన్యం నిల్వలే చాలా చోట్ల లేవు. ఇక మూడేళ్ల కిందట నిల్వలు ఎక్కడ ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎంఆర్‌కు బదులు డబ్బులైనా రాబట్టాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. గత పదేళ్లుగా మరో 48 మంది మిల్లర్లు రూ.270 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా 32 మంది కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులను కోర్టు కొట్టివేసింది.

