కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరును ఎడారిగా మార్చేందుకు కృష్ణ, తుంగభద్ర నదులపై అక్రమంగా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హెచ్చరించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల పరిశీలన యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేవలం 10 శాతం మాత్రమే మిగిలి ఉన్న పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆయన దుయ్యబట్టారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా 60 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాలువలు అన్ని పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల తుంగభద్ర నది గేట్ల ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి 300 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టుగా పెంచేందుకు భూముల సర్వే కూడా పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం లేదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర డ్యామ్ ద్వారానే శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎక్కువ మొత్తంలో వరద వస్తుందని, అలాంటి ప్రాజెక్టుపై అక్రమంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించడంతో కిందికి చుక్క నీరు వచ్చే అవకాశాలు ఉండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గండ్రేవుల, చిక్కలమంచలి, నావలి, కురివి తదితర ప్రాంతాల్లో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలం చెందిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
రాజకీయం కాదు.. ప్రజల బతుకు తెరువు
పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, పాలమూరు ప్రజల బతుకుదెరువుతో ముడిపడిన విషయమని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు ప్రజలకు ద్రోహం చేసినవారిగా మిగిలిపోరాదని ఉద్దేశంతోనే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని ఆయన తెలిపారు. గత 15 రోజుల క్రితం ప్రాజెక్టు లయాత్ర చేపట్టడం మూలంగానే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుందని, ఆరు మాసాల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారని ఆయన తెలిపారు.
మాట తప్పితే ప్రజా పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ సెక్రటరీగా, ఇరిగేషన్ సెక్రటరీగా విధులు నిర్వహించిన ఆదిత్య నాథ్ దాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రధాన సలహాదారులుగా నియమించుకోవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రాజెక్టులకు మేలు చేసే విధంగా వివరించిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నియమించుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, వెంకటేశ్వర రెడ్డి గంజి వెంకన్న, రాజేశ్వర్ గౌడ్, ఆంజనేయులు, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

