కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు ఉదయం హనుమకొండలోని ఆయన నివాసంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన వరంగల్లోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం వెంటనే స్పందించింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రోహిణి ఆస్పత్రి వైద్యుల బృందంతో ఫోన్ లో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కలిసి హనుమకొండకు హుటాహుటిన బయలుదేరారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యమ క్రమంలో అనేక సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళారు. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతే ఆయన వివాహం చేసుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకమైన నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక పేరుంది. ఉద్యమకారుడిగా ఆయన చూపిన నిబద్ధతకు గౌరవంగా, పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహానికి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తన సతీమణితో కలిసి స్వయంగా తిరుపతికి వెళ్లి మరి నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

