కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యంపైనా మాఫియా కన్ను పడింది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా (PDS Smuggling) సాగింది. అయితే.. సన్నబియ్యం పంపిణీ మొదలైన తర్వాత తగ్గింది. తాజాగా వెలుగు చూసిన ఘటన అందుకు విరుద్ధమని తేలింది. సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్క రాష్ట్రానికి తరలించి అధిక ధరలకు అమ్ముతున్న ముఠా ఇప్పటికీ చురుగ్గానే ఉందనే అనుమానాలు తలెత్తాయి.
తాజాగా భూపాలపల్లి జిల్లా గణపురంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడిలో 170 క్వింటాళ్ల పీడీఎస్ సన్న బియ్యం పట్టుబడడంతో అక్రమ దందా (PDS Smuggling) బట్టబయలైంది. సన్నబియ్యాన్ని అక్రమ రవాణాకు నిల్వ చేశారని తెలియడంతో అధికారులు అవాక్కైయ్యారు. కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్రలోని సిరొంచకు అక్రమ రవాణా జరుగుతున్నట్టు విచారణలో తేలడంతో పాత మాఫియా నెట్‌వర్క్ మళ్లీ యాక్టివ్ అయినట్లు అనుమానాలు బలపడ్డాయి.
విజిలెన్స్ నిఘా.. పట్టుబడిన ముఠా
భూపాలపల్లి జిల్లా గణపురంలో భారీగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నారనే సమాచారంతో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ ప్రభాకర్ బృందం సోమవారం ప్రత్యేక నిఘా పెట్టింది. బియ్యం లోడుతో వెళ్లే టాటా ఏస్ వాహనాన్ని అధికారులు వెంబడించారు. గణపురంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. అనంతరం అందులోని బియ్యం బస్తాలను దింపుతుండగా అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు.
20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో తనిఖీలు చేయగా నిల్వ ఉంచిన మరో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభించాయి. మొత్తం 170 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోటెం సారంగపాణి అనే వ్యక్తి అద్దెకు తీసుకున్న ఇంట్లో బియ్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. సారంగపాణితో పాటు టాటా ఏస్ డ్రైవర్ తూర్పాటి కిషన్‌ను అదుపులోకి తీసుకుని గణపురం పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని స్థానిక రైస్ మిల్లుకు తరలించారు. విచారణలో స్థానిక వ్యాపారి భానుచందర్ తనకు అప్పగించినట్లు సారంగపాణి చెప్పినట్టు తెలిసింది.
మహారాష్ట్రలోని సిరొంచకు తరలింపు
గణపురంలో నిల్వ చేసిన బియ్యాన్ని కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్రలోని సిరొంచకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు భావించారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని సిరొంచకు అక్రమంగా తరలించి అధిక ధరలకు అమ్ముకునే ముఠాలు చురుగ్గా పని చేశాయి. ఇప్పుడు అదే తరహాలో సన్నబియ్యాన్ని కూడా సేకరించి అక్రమంగా తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు బియ్యం వ్యాపారులకు సిరొంచలోని రైస్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టగా.. స్థానికంగా రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా సరిహద్దు దాటించి అక్కడ అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా వెనుక నెట్‌వర్క్‌ను బయటకు తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వరుసగా అక్రమ నిల్వలు బట్టబయలు
ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపురం, హసన్‌పర్తి మండలాల్లో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించారు. తాజాగా గణపురంలో భారీగా బియ్యం లభించడంతో ఉమ్మడి జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన కొన్ని శాఖల అధికారుల సహకారం లేకుండా దందా కొనసాగించడం సాధ్యం కాదనే ఆరోపణలు ఉన్నాయి.

