కలం, వెబ్ డెస్క్: తాడిపత్రి(Tadipatri)లో రాజకీయం వేడెక్కింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy), జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చకు రావాలంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గరైనా సరే, కడప కోటిరెడ్డి సెంటర్ అయినా సరే, అనంతపురం క్లాక్ టవర్ అయినా సరే ఎక్కడికైనా వస్తానంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. సవాల్‌కు సై అంటూ జేసీ వర్గం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ఇంటి వద్దే చర్చకు సిద్ధమని ప్రకటించారు.
నేడు పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి జేసీ వర్గీయులు పిలుపునిచ్చారు. సంగ్రామానికి సిద్ధం కండి అంటూ టీడీపీ కార్యకర్తలు, జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జేసీ వర్గీయులు తన ఇంటి వద్ద రాళ్లు డంప్ చేశారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. కేతిరెడ్డి ఇంటి వద్ద ఉన్న కాలేజ్ గ్రౌండ్‌లో రాళ్లు డంప్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ పెద్దారెడ్డి వర్గీయులు జేసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి(Tadipatri)లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడిపత్రిలో ఏ క్షణాల ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


