కలం, నేషనల్ డెస్క్ : “చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న చట్టం 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి” అని ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం జరిగిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’లో ఆయన ప్రసంగిస్తూ.. ఇది కేవలం కీలకమైన నిర్ణయమే కాక చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. అందుకే ఈ చట్టాన్ని, నిర్ణయాన్ని దేశంలోని “నారీ శక్తి”కి అంకితం చేస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో అనేక మైలురాళ్లను అధిగమిస్తున్న ప్రస్తుత తరుణంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అతి పెద్ద నిర్ణయాన్ని చటట సవరణ ద్వారా తీసుకోబోతున్నామన్నారు. సామాజిక న్యాయం కేవలం ఒక నినాదంగా కాకుండా, పాలనలో భాగంగా మారుతుందన్నారు. గతంలోని సంకల్పాలను నెరవేరుస్తూ, భవిష్యత్తు కోసం సమసమాజాన్ని నిర్మించే దిశగా పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించబోతున్నదన్నారు. దశాబ్దాల నిరీక్షణకు ఇది ముగింపు అని అన్నారు.
నాలుగు దశాబ్దాల ప్రయాణం ముగిసింది :
మహిళలకు రిజర్వేషన్లు (Women Reservations) కల్పించాలనే చర్చ దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగుతూ ఉన్న ప్రక్రియ అని, అన్ని రాజకీయ పార్టీలు, గత తరాలు తమదైన రీతిలో ఈ అంశంపై కృషి చేశాయని ప్రధాని మోదీ (PM Modi) గుర్తు చేశారు. మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటికి ఖచ్చితంగా అమలు చేయాలనే ఏకగ్రీవ డిమాండ్ ఉందని, దీనిపై ఏప్రిల్ 16 నుండి పార్లమెంటులో సమగ్ర చర్చ జరగనుందని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై, మహిళల ప్రయోజనాల కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని, నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని, ఎట్టకేలకు సాకారం అయిందని, దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

