కలం, తెలంగాణ బ్యూరో : పార్టీ టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చిన తర్వాత పాత టైటిల్ కోసం అన్న కేటీఆర్, చెల్లెలు కవిత (KTR vs Kavitha) వారి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. TRS పేరును తిరిగి తీసుకోడానికి ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆ పేరు ‘ఫ్రీ లిస్టు’లోనే ఉన్నదని, ఎవరికైనా అలాట్ చేయొచ్చని కవిత ఇటీవల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్న తర్వాత శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నదని, తిరిగి టీఆర్ఎస్ పేరు పెట్టాలంటూ ఒత్తిడి వస్తున్నదని, దాని గురించి ఆలోచిస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇద్దరూ టీఆర్ఎస్ పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇవ్వకపోయినా అబ్రివేషన్‌లో టీఆర్ఎస్ వచ్చేలా ఆలోచిస్తున్నారు. ఆ టైటిల్‌కు తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను పొలిటికల్‌గా వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టైటిల్‌తో ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయా? :
ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన నినాదముంటే ప్రజలు ఆదరిస్తారని, ఆ పార్టీ ఆచరణను చూసిన తర్వాత విశ్వాసంలోకి తీసుకుంటారన్నది బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ తొలి నాళ్ళలో ఆ నినాదాన్ని అందుకున్నదని, ప్రజలు బలమైన ఆకాంక్షతో ఆ పార్టీని ఆదరించి అధికారాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి బలమైన నినాదం ఉంటేనే కొత్త పార్టీకి ఉనికి ఉంటుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే ఆలోచన పార్టీలో లేనప్పటికీ శ్రేణులు మాత్రం బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఒకసారి పేరు మార్చుకున్న తర్వాత మళ్లీ పాత పేరుకు వెళ్లడంతోనే ప్రజల్లో విశ్వాసం ఉంటుందని ప్రస్తుత పరిస్థితుల్లో భావించలేమన్నారు. కేవలం ఆ టైటిల్ ఒక్కటే ప్రజలు గెలిపిస్తారని అనుకోలేమని గుర్తుచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ (BRS) అయినా కొత్తగా పుట్టుకొచ్చే కవిత పార్టీ అయినా టైటిల్‌మీద మాత్రమే ఆశలు పెట్టుకోవడం సరైంది కాదన్నారు.
ఎలక్షన్ కమిషన్ నిబంధనల్లో ఏమున్నది? :
ఒక రాజకీయ పార్టీకి టైటిల్ ఇవ్వడానికి ఎన్నికల సంఘానికి నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయి. ప్రజలు, వివిధ పార్టీల నుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలను తీసుకున్న తర్వాత వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల గుర్తు విషయంలో స్పష్టంగా ఆరు సంవత్సరాల నిబంధన ఉన్నప్పటికీ పాత పార్టీ పేరును కొత్త పార్టీకి ఇవ్వడానికి మాత్రం అలాంటి నిబంధనలేవీ లేవు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకున్న తర్వాత మరో ఆరేండ్ల వరకు పేరు మార్చుకోడానికి వీల్లేదు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం 2022 దసరా రోజున (అక్టోబరు 5) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీర్మానం చేయగా కేంద్ర ఎన్నికల సంఘం 2022 డిసెంబరు 8న ఆమోదం తెలిపింది. ఆ ప్రకారం 2028 డిసెంబరు 7వ తేదీ వరకు మరోసారి పేరు మార్చుకునే అవకాశం లేదు.
ఈసీ విచక్షణాధికారం మేరకు నిర్ణయం :
పాత పార్టీ పేరు ‘ఫ్రీ లిస్టు’లో ఉన్నా దాన్ని కొత్త పార్టీకి కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన విచక్షణాధికారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు కాకపోయినా తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రాజ్య సంఘం.. ఇలాంటి పేర్లను ఎంచుకుంటే టీఆర్ఎస్ అనే అబ్రివేషన్‌తో పిల్చుకునే వీలుంటుందని కొత్త పార్టీలు పెట్టేవారు ఆలోచిస్తున్నారు. కానీ ఆ పేరు ఇవ్వడానికి ఎన్నికల సంఘం తనకున్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటుంది. ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనతా పార్టీ ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ యాక్టివ్‌గా లేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఆ పార్టీ పేరు (టైటిల్)ను తొలగించి ఫ్రీ లిస్టులో పెట్టడానికి తగిన అవకాశాలు ఉన్నా ఎలక్షన్ కమిషన్ మాత్రం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఏ పార్టీకీ కేటాయించలేదు. టీఆర్ఎస్ విషయంలో సైతం రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అదే తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
అన్నా చెల్లెళ్ల ప్రయత్నాలు కంటిన్యూ అవుతాయా? :
ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్తగా పెట్టబోయే పార్టీ టైటిల్ టీఆర్ఎస్ తరహాలో ఉండేలా ప్రయత్నం చేస్తారా?.. ఈసీ నుంచి సానుకూల స్పందన వస్తుందా?.. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు పెట్టేలా ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నందున టీఆర్ఎస్ టైటిల్ ప్రయత్నాలను విరమించుకుంటారా?.. ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ శ్రేణులు తిరిగి టీఆర్ఎస్ టైటిల్‌ను కోరుకుంటున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి పార్టీ పేరు మార్పు కోసం ఈసీని బీఆర్ఎస్ ఆశ్రయిస్తుందా?.. ఆరేండ్ల దాకా పేరు మారకూడదన్న నిబంధనతో బీఆర్ఎస్ తన ప్రయత్నాన్ని విరమించుకుంటుందా?.. కేవలం సెంటిమెంట్ కోసం ఇద్దరూ టైటిల్ కోసం కోల్డ్ వార్ మొదలుపెట్టారా?.. ఇలాంటి వాదనలూ తెరమీదకు వచ్చాయి. మరో రెండున్నరేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అన్నా చెల్లెళ్ల (KTR vs Kavitha) టైటిల్ గేమ్ ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.
Read Also: అండర్ ట్రయల్ ఖైదీ.. జైల్లోనే బందీ!
Follow Us On : WhatsApp

