ముంచుకొస్తున్న కరువు.. రైతులకు పంట బీమా దక్కేనా?

కలం, తెలంగాణ బ్యూరో : వర్షాకాలం మొదలై నెల దాటిపోతున్నా చినుకు జాడ లేదు. ఎల్ నినో ప్రభావంతో కరువు ముంచుకొస్తున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (PMFBY) తెలంగాణలో ఇంకా అడుగు ముందుకు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆన్‌లైన్ పోర్టల్‌లో రాష్ట్రం ఇంకా యాక్టివ్ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు అయోమయంలో పడ్డారు.

2020లో నిలిపివేత.. కాంగ్రెస్ హామీ ఏమైంది?

2020లో ఈ పథకం నుంచి నాటి కేసీఆర్ సర్కార్ తప్పుకుంది. ఫసల్ బీమా యోజన అశాస్త్రీయంగా ఉందని.. అదొక బోగస్ అంటూ తప్పుకున్నారు. దీంతో పంటలకు బీమా అనేదే లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పథకం మళ్లీ తెరమీదికి వచ్చింది. రైతు ప్రయోజనాల దృష్ట్యా దీన్ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఇంతవరకు అది ముందుకు సాగడం లేదు. కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి.

రైతు ప్రీమియం కూడా చెల్లిస్తామనీ..!

నైరుతి రుతుపవనాల ప్రభావం ఈసారి తక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీంతో కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమై 11 రాష్ట్రాల పరిధిలోని 315 జిల్లాల్లో ప్రతికూల పరిస్థితులుంటాయని, దిగుబడి గణనీయంగా పడిపోతుందని లెక్కలేసింది. ఇందులో తెలంగాణలోని జిల్లాలు కూడా ఉన్నాయి. పంటలు నష్టపోయినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాల కింద రైతులకు నష్టపరిహారం ఇవ్వడం ఆనవాయితీ. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ టర్ములో మాత్రమే కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని అమలు చేసింది. సెకండ్ టర్ములో పూర్తిగా నిలిపేసింది. పంట బీమా అన్నదే లేకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ పథకంలో చేరుతున్నట్లు ప్రకటించింది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కానీ.. ఇప్పటివరకు అది యాక్టివ్ కాలేదని, కేవలం కాగితాలకే పరిమితమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రైతులకు పంటల బీమా స్కీమ్‌పై ధీమా లేకుండాపోయింది. కరువు ముంచుకొస్తున్న వేళ ఆ బీమా అయినా ఆదుకుంటుందన్న ఆశలు కనిపించడం లేదు.

నష్టపోయిన, నష్టపోయే రైతులకు దిక్కేది?

ఎల్ నినో కారణంగా తగినంత వర్షాల్లేక విత్తనాలు మొలకెత్తక రైతులకు నష్టం జరిగింది. సాగు రంగానికి తీవ్రంగానే దెబ్బ తగిలింది. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, పెసర, మినుము, కందులు వంటి ఆరుతడి పంటల వైపు మళ్లినా తేమ, సాగునీరు అందక నీలినీడలు కమ్ముకున్నాయి. పెట్టిన పెట్టుబడి పోయి, ప్రత్యామ్నాయ పంటలు దక్కక లక్షలాది రైతాంగం అయోమయంలో పడ్డారు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాలను అమలు చేస్తుంటాయి. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ రాష్ట్రంలో తిరిగి అందుబాటులోకి వస్తుందని, రైతుల వాటా ప్రీమియాన్ని వంద శాతం భరిస్తామని, ఉచిత పంటల బీమా అందిస్తామని రాష్ట్ర సర్కార్ చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. దాదాపు 40 లక్షల మంది రైతులు, సుమారు కోటి ఇరవై లక్షల ఎకరాల సాగు భూమి బీమా పరిధిలోకి రావాల్సి ఉన్నా రాష్ట్ర వ్యవసాయ వర్గాల నుంచి క్లారిటీ లేదు. ఇప్పుడు వర్షాభావంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి లేదా బీమా సంస్థల నుంచి అందుతుందో తెలియని గందరగోళం నెలకొన్నది.

ఆన్లైన్ పోర్టల్లో యాక్టివ్ ఎక్కడ?

ఎల్‌ నినో ప్రభావం 11 రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో దాదాపు 111 జిల్లాల్లో సాధారణంకంటే మూడొంతుల వర్షాలు తగ్గిపోయి కేవలం 25 శాతమే వానలు కురవొచ్చని అంచనా వేసి ప్రభుత్వం, బీమా సంస్థల నుంచి సాయం అందేలా ‘హై ప్రయారిటీ’ కేటగిరీలో పెట్టింది. మరో 76 జిల్లాల్లో 50% వర్షాలే కురుస్తాయని ‘మీడియం’ కేటగిరీలో, మిగిలిన 128 జిల్లాల్లో సాధారణం స్థాయికి దగ్గరగా ఉండొచ్చని పేర్కొన్నది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ఆర్థిక శాఖ రైతులకు నష్టం జరగకుండా బీమా సంస్థలు ఫసల్ బీమా యోజన పథకంలో రైతుల్ని ఎన్‌రోల్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఎన్‌రోల్ కాని రైతులకు పంటల నష్ట పరిహారం అందనందున ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అర్హులైనవారందరినీ చేర్చాలని స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్‌కు 2%, రబీ సీజన్‌కు 1.5% చొప్పున రైతుల నుంచి ప్రీమియం వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రీమియం చెల్లిస్తామని చెప్పింది. కానీ ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం తెలంగాణ ఇంకా యాక్టివ్ మోడ్‌లోకి రాలేదు.

యాక్టివ్ కానందునే పేరు చేర్చలేదు: కేంద్రం

బీఆర్ఎస్ తొలి టర్ములో 2016-20 మధ్యకాలంలో నాలుగేండ్ల పాటు ఫసల్ బీమా యోజన పథకం అమలైనప్పుడు లక్షలాది మంది ఎన్‌రోల్ అయ్యారు. కొందరు నష్టపరిహారం పొందారు. సెకండ్ టర్ములో ఈ స్కీమ్ అమలునే నిలిపివేస్తున్నట్లు నాటి సీఎం కేసీఆర్ చెప్పడంతో.. రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ స్కీమ్‌లో రాష్ట్రం చేరుతున్నట్లు ప్రకటించినా కేంద్రం రూపొందించిన జాబితాలో తెలంగాణకు స్థానం లేదు. ఇంకా యాక్టివ్ కానందునే జాబితాలో పేరు ఎక్కలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు తీరు

గతంలో (2016 నుండి 2020 వరకు) తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు జరిగిన తీరును పరిశీలిస్తే.. 2016-17 ఆర్థిక సంవత్సరం: ఈ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 9.73 లక్షల మంది రైతులు బీమా కోసం ఎన్‌రోల్ చేసుకోగా, 8.23 లక్షల హెక్టార్ల సాగు భూమి బీమా పరిధిలోకి వచ్చింది. పంట నష్టపోయిన రైతులకు ఆ ఏడాది 2.25 లక్షల క్లెయిమ్‌లు మంజూరయ్యాయి.

2017-18 ఆర్థిక సంవత్సరం ఈ పథకంలో రికార్డు స్థాయిలో 10.90 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 10.61 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి బీమా కల్పించగా, అత్యధికంగా 4.43 లక్షల క్లెయిమ్‌లు రైతులకు అందాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా నమోదు కొంత తగ్గి 7.81 లక్షల మంది రైతులు ఎన్‌రోల్ అయ్యారు. 8.02 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి బీమా వర్తింపజేయగా, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల కేవలం 0.03 లక్షల క్లెయిమ్‌లు మాత్రమే నమోదయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.17 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 7.84 లక్షల హెక్టార్ల భూమికి రక్షణ లభించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వం స్కీమ్ నుండి తప్పుకోవడంతో క్లెయిమ్‌ల ప్రక్రియ నిలిచిపోయింది.

కేంద్ర ప్రభుత్వ పథకం అమలు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా ఎలాంటి పంట బీమా పథకం లేకపోవడంతో కరువు ముంగిట ఉన్న తెలంగాణ రైతులకు ఈసారి పరిహారం ఎలా అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, రైతుల్లో ధీమా నింపాలని అన్నదాతలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>