కలం, చండూరు: చండూరు (Chandur) మండల పరిధిలోని నేర్మట-బంగారిగడ్డ పాత రోడ్డు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా తుమ్మ, ఈత కంప చెట్లు దట్టంగా పెరిగిపోయాయి. గతంలో హరితహారం పథకంలో నాటిన మొక్కలు కూడా అడవిలా అల్లుకుపోయాయి. దీంతో దారి పూర్తిగా మూసుకుపోవడంతో రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గాయపడుతున్న వాహనదారులు..
ఈ రోడ్డుపై బంగారిగడ్డ, గొల్లగూడెం తదితర గ్రామాలకు ప్రజలు, పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించిన కంప చెట్ల కారణంగా దారి ఇరుకుగా మారింది. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే తప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది.
ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు ఈ కంపలు నేరుగా ముఖానికి, కళ్లకు తగిలి గాయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పెరిగిన చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తగులుతుండటంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు.
మట్టి పోసి వదిలేశారు..
ఇక వర్షాల సమయంలో ఈ దారిపై వెళ్తే చుక్కలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున గుంతలు పడి చెరువులను తలపిస్తున్నాయి. గతంలో వర్షాల సమయంలో ఇళ్లు ఉన్నంత వరకు మాత్రమే పంచాయతీ అధికారులు మట్టి పోసి చదును చేసి చేతులు దులుపుకున్నారు. అసలు సమస్యగా మారిన కంప చెట్లు, ముళ్ల పొదలను తొలగించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని గ్రామస్థులు మండిపడుతున్నారు.
బీటీ రోడ్డు మంజూరైనా..
ఈ మట్టి రోడ్డుకు ఎన్నో ఏళ్ల క్రితమే తారు రోడ్డు మంజూరైందని ప్రచారం జరుగుతుంటుంది. కానీ, ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం వచ్చే ప్రజాప్రతినిధులు ఈసారి పక్కాగా బీటీ రోడ్డు వేయిస్తామని హామీలు ఇవ్వడం, గెలిచాక మొహం చాటేయడం పరిపాటిగా మారిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, తక్షణమే యుద్ధప్రాతిపదికన రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని నేర్మట, బంగారిగడ్డ, గొల్లగూడెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి రవాణా కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

