కలం, తెలంగాణ బ్యూరో : ఎల్ నినో ప్రభావం(El Nino Effect)తో రాష్ట్రంలో మరో రెండు నెలలపాటు వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగత్తలను కేంద్ర నిపుణులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగానికి వివరించారు. ఈ మేరకు వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు మూడు దశల (మూడంచెల) యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మండలాలవారీగా వీక్లీ వెదర్ బులెటిన్లను జారీ చేయాలని నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించారు.
నిపుణుల సూచనల మేరకు జిల్లాలవారీగా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాతావరణ శాఖ (ఐఎండీ), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ఇక్రిశాట్లో జరిగిన సమగ్ర సమీక్షలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ ఖరారైంది.
మూడు దశల్లో ప్రణాళికలు
రాష్ట్రంలో వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ‘డ్రై స్పెల్స్’, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. జూలై 15 వరకు వర్షాలు రాకపోతే 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, జూలై 30 వరకు ఆలస్యమైతే 13.82 లక్షల క్వింటాళ్లు, ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 20 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉందని మంత్రి వెల్లడించారు.
డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్ సిస్టమ్
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్ (డీఎస్ఆర్) విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రియల్ టైమ్ వర్షపాతం పర్యవేక్షణ, నేలలోని తేమ పరిశీలన, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, పంటల ఎదుగుదల అంచనాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, నేల తేమ సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ వంటి చర్యలను అమలు చేయనున్నారు. వాతావరణ శాఖ, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్యంగా పనిచేసి ప్రతీ వారం మండలాలవారీగా ‘అగ్రో-వెదర్ బులెటిన్’ విడుదల చేయాలని ఆదేశించారు.
ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం విడుదలయ్యే బులెటిన్లో వర్షపాతం, వాతావరణ అంచనాలు, డ్రై స్పెల్స్ అవకాశాలు, ఉష్ణోగ్రతలు, నేల తేమ, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు, ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత వంటి అంశాలను పొందుపరచాలని మంత్రి తెలిపారు. రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా రైతులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు.
శాస్త్రవేత్తల సూచనలివే
ఈ నేపథ్యంలోనే శాస్రవేత్తలు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు సాగులో పలు జాగ్రత్తలు, ఆధునిక పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలని, భూమిలో తగినంత తేమ ఏర్పడే వరకు ఎలాంటి ఎరువులు వేయకూడదని స్పష్టం చేశారు. పొలాల్లో తేమను సంరక్షించుకోవడానికి ‘బ్రాడ్ బెడ్ అండ్ ఫరో’ లేదా ‘రిడ్జ్ అండ్ ఫరో’ వంటి సాగు పద్ధతులను అవలంబించాలని, అలాగే నేలలో తేమ ఆరిపోకుండా ఉండేందుకు ఇంటర్ కల్టివేషన్ (అంతర కృషి) చేయాలని తెలిపారు.
అలాగే రైతులు ఎరువులను అవసరమైనప్పుడే వివేచనతో ఉపయోగించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ‘స్కిప్ రో ఇరిగేషన్’ పద్ధతిని అమలు చేయాలని, ఒకవేళ వర్షాలు లేక పంటలు ఎండిపోయే (డ్రై స్పెల్స్) పరిస్థితులు ఏర్పడితే యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాలను ఆకులపై పిచికారీ చేయాలని సిఫార్సు చేశారు. వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించుకుంటూ, ప్రధాన పంటలతో పాటు అంతర పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
వరి పండించే రైతులు నారుమడుల్లో కార్బోఫ్యూరాన్ కార్బోఫ్యూరాన్ వినియోగం, దగ్గరగా నాట్లు వేయడం, అదనపు నత్రజని వినియోగం, ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. నారు వేయని రైతులు తక్కువ వ్యవధిలో పండే రకాలతో ‘డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్’ (నారు లేకుండా నేరుగా వరి నాటుకోవడం) పద్ధతిని అనుసరించాలని తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కిందా ఆరుతడి పంటలే..
ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాల్లోనూ ఆరు తడి పంటలనే వేయాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. భారీ ఇరిగేషన్ రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు ఆశాజనకంగా లేవని, భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉండడంతో వరదలు కూడా స్వల్పంగానే ఉంటాయన్నారు. భూగర్భజలాలు కూడా తొందరగా ఇంకిపోతున్న దృష్ట్యా బావుల, బోర్ల కింద రైతులు చిరుధాన్యాలు, తక్కువ నీటి వినియోగ పంటలు ప్రోత్సహించాలని తుమ్మల పిలుపునిచ్చారు.

