కలం, వెబ్ డెస్క్: భారత షూటింగ్ స్టార్ రాహీ సర్నోబత్ (Rahi Sarnobat) మరోసారి తన సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో జరిగిన టీ4 జాతీయ ఎంపిక ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో వరల్డ్ కప్, ఆసియా క్రీడల ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. భారత్‌లో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభం కాదని రాహీ తెలిపింది. దేశీయ పోటీలు చాలా కఠినంగా ఉంటాయని పేర్కొంది. అయితే ఒత్తిడి మధ్య తన ప్రణాళికను సరిగ్గా అమలు చేయగలిగాననే సంతృప్తి ఉందని వెల్లడించింది.
అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసి జట్టుకు బలంగా మారాయని రాహీ చెప్పింది. యువ షూటర్లు కొత్త ఆలోచనలు తీసుకొస్తే, సీనియర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారని వివరించింది. భారత్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పోటీ స్థాయి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటిలో ఒకటిగా ఉందని ఆమె అభిప్రాయపడింది. మను భాకర్, ఈషా సింగ్ లాంటి ఆటగాళ్లతో కలిసి శిక్షణ పొందడం తన ఆటను మరింత మెరుగుపరుస్తోందని తెలిపింది.
ఫలితాల కంటే ఇప్పుడు మానసిక స్థిరత్వంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు రాహీ వెల్లడించింది. ప్రతి షాట్‌పై పూర్తి ఏకాగ్రతతో ఉండటం నేర్చుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం జాతీయ శిక్షణ శిబిరం కొనసాగుతోంది. వరల్డ్ కప్‌లో నిలకడైన ప్రదర్శన చేయడం, అదే జోరును ఆసియా క్రీడల్లో కొనసాగించడం జట్టు లక్ష్యంగా ఉందని రాహీ తెలిపింది.

