Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గ (Modi Cabinet) పనితీరు, పరిపాలనా సామర్థ్యంపై ప్రధాని గురువారం 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సేవాతీర్థ్‌లో జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్యంగా మంత్రిత్వ శాఖల పనితీరుపై పీఎంఓ ముందుగానే ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయగా.. శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శుల పనితీరును క్యాబినెట్‌ కార్యదర్శి వివరించారు.

ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాల సాధన, పరిపాలనా బాధ్యతల నిర్వహణలో ఉన్న లోపాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపై ప్రధాని సమగ్ర సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, కార్యదర్శులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పని తీరు మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయబడ్డారు. “ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలి. ప్రజాధనాన్ని వీలైనంతగా పొదుపు చేయాలి” అని ప్రధాని సూచించారు. సమర్థవంతమైన పరిపాలనతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి జాతీయ రోజ్‌గార్‌ మేళా అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.

గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ సమీక్ష సమావేశం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. మోదీ 3.0 పాలనకు రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షించడము – నిర్లక్ష్యం వహించిన శాఖల మంత్రులను హెచ్చరించడం ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా నిలిచింది.

ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ (Modi Cabinet) సమీక్ష సమావేశం అనంతరం వెలువడిన సమాచారం ప్రకారం.. కొన్ని మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి మంత్రిత్వ శాఖ పనితీరుపై పీఎంఓ ముందుగానే సిద్ధం చేసిన సమగ్ర నివేదికల ఆధారంగా ఈ సమావేశం సాగింది. శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శుల పనితీరును క్యాబినెట్‌ కార్యదర్శి ప్రధానికి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా లక్ష్యాల సాధనలో జాప్యం, అమలులో లోపాలు, బలహీన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సునిశిత సమీక్ష నిర్వహించారు. బాధ్యతాయుత పరిపాలన, సమర్థత విషయంలో మంత్రులు, అధికారులకు ఆయన గట్టి సందేశం ఇచ్చారని, సమన్వయం, క్రమశిక్షణ, ప్రజాధన వినియోగంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఈ కీలక సమీక్ష ముగిసిన అనంతరం కేంద్ర మంత్రివర్గ (Modi Cabinet) పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పులు తప్పవనే ప్రచారం జోరందుకోవడంతో కొందరు మంత్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇంధన, ఆర్థిక, జాతీయ సవాళ్లను ఎదుర్కొనే ప్రభుత్వ సన్నద్ధతపైనే చర్చ జరిగినట్లు సమాచారం. పెట్రోలియం, వ్యవసాయం, ఎరువులు, పౌర విమానయాన, షిప్పింగ్ & లాజిస్టిక్స్ వంటి కీలక శాఖలతో పాటు ఉపాధి కల్పన (రోజ్‌గార్‌ కార్యక్రమాలు), సంక్షేమ పథకాల అమలుపై సీరియస్ గా చర్చించారు. అలాగే భవిష్యత్ కార్యచరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

కేంద్రము అమలు చేస్తోన్న ప్రాజెక్టుల అమలులో జాప్యం, ప్రజల్లో బలహీన ప్రచారం, నిరుద్యోగ సమస్యలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల ఒత్తిడి,  పీఎంఓ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయం లోపించిన శాఖలపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధాని 20 నుంచి 30 మంది మంత్రులను తప్పించే అవకాశం ఉందని ఢిల్లీలో చర్చ నడుస్తోంది. పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశాలు నిర్వహించి రాష్ట్రాల వారీగా కొత్త టీంలను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతమైంది.

జాతీయ స్థాయిలో కొత్త ఆఫీస్‌ బేరర్ల నియామకం, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల ఎంపిక, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వంటి అనుబంధ విభాగాల్లో మార్పులు, రాబోయే  ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేపట్టనున్నారు. దక్షిణాది ప్రాతినిధ్యం అంశాలపై తెలంగాణకు సంబంధించి సంస్థాగత పదవులు, కేంద్ర మంత్రి వర్గంలో ముఖ్యంగా మహిళా నాయకత్వంపై పార్టీ దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్రపక్ష సమీకరణలు, టీడీపీ, బీజేపీ సంబంధాల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కూడా కేంద్రంలో మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. కర్ణాటకలో BJP బలమైన స్థితిలో ఉండటంతో పాటు, రాజ్యసభ ఎన్నికలు, సంస్థాగత మార్పుల కారణంగా ఆ రాష్ట్రం కీలక ప్రాధాన్యత ఉండబోతోంది. అలాగే ఎన్నికల పరంగా అత్యంత కీలక రాష్ట్రంగా ఉన్న బీహార్‌కు కులగణన, సామాజిక సమీకరణల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌కు 2027 రాజకీయ వ్యూహాల దృష్ట్యా కేంద్ర నాయకత్వం ప్రత్యేక ఫోకస్ కొనసాగించే అవకాశముంది.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత :

2027 నుంచి 2029 వరకు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027 ఫిబ్రవరి/మార్చి నెలల్లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అదే ఏడాది నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2028 ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. మే 2028లో కర్ణాటకలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక నవంబర్ 2028లో దక్షిణ , మధ్య భారత రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యమైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే-జూన్ 2029లో దేశవ్యాప్తంగా లోక్‌సభ సాధారణ ఎన్నికలు నిర్వహించే విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

కీలక విషయాలపై ప్రధాని మోదీ దృష్టి..

జూన్ 9, 2026తో ప్రధాని మోదీ నేతృత్వంలోని “మోదీ 3.0” ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం 2024 జూన్ 9న అధికారంలోకి వచ్చింది. 2047 లక్ష్యంగా ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత బలోపేతం చేయడం, అలాగే ‘వికసిత్ భారత్’ అనే సామూహిక లక్ష్య సాధనను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం వచ్చే ఏడాది 2027 జూలై 25తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి ఎన్నికలు 2027 మధ్యలో జరగనున్నాయి. ఆ విషయంపై కూడా ప్రధానమంత్రి మోదీ దృష్టి సారించారు.

Read Also: పొదుపు సంఘాలు కాదు.. ప్రగతి శక్తులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>