కలం, స్పోర్ట్స్ : జకార్తాలో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (Asian Youth Boxing Championships)లో భారత యువ బాక్సర్లు తమ పంజా విసురుతున్నారు. మూడో రోజు జరిగిన అండర్-19 పోటీల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోయారు. ముఖ్యంగా 50 కేజీల విభాగంలో అంబేకర్ మీతెయ్ రింగులోకి దిగిన వెంటనే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. చైనీస్ తైపీకి చెందిన కీ-యూ క్సియావోను మొదటి రౌండ్ లోనే ఆర్ఎస్‌సీ (RSC) రూపంలో ఓడించి ఘన విజయం సాధించాడు.
ఈ టోర్నీ జూలై 5న ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే భారత మహిళా బాక్సర్లు చంద్రికా పూజారి, జాయ్‌శ్రీ దేవి దేశానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 51 కేజీల విభాగంలో చంద్రికా పూజారి 5-0తో మంగోలియా బాక్సర్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అలాగే 54 కేజీల విభాగంలో జాయ్‌శ్రీ దేవి చైనీస్ తైపీ బాక్సర్‌ను రెండో రౌండ్‌లోనే ఆర్ఎస్‌సీ ద్వారా ఓడించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.
అదే జోరును మూడో రోజు కూడా భారత బాలుర జట్టు కొనసాగించింది. 55 కేజీల విభాగంలో ఆదిత్య కిర్గిజిస్తాన్ బాక్సర్‌పై, 60 కేజీల విభాగంలో సికందర్ కొరియా బాక్సర్‌పై 5-0 తేడాతో క్లీన్ విజయాలు నమోదు చేశారు. 75 కేజీల విభాగంలో దేవేంద్ర చౌదరి చైనీస్ తైపీ బాక్సర్‌ను రెండో రౌండ్‌లోనే ఓడించాడు. అయితే 70 కేజీల విభాగంలో ప్రశాంత్ కజకిస్తాన్ బాక్సర్‌తో గట్టిగా పోరాడినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూశాడు.
భారత బాక్సింగ్ సమాఖ్య ఈ టోర్నీ కోసం బలమైన జట్టును బరిలోకి దించింది. అండర్-19, అండర్-23 విభాగాల్లో చెరో 20 మంది చొప్పున బాక్సర్లు పోటీ పడుతున్నారు. జూలై 16 వరకు సాగే ఈ టోర్నమెంట్ భారత యువ బాక్సర్ల భవిష్యత్తుకు ఎంతో కీలకం కానుంది.

