కలం, స్పోర్ట్స్ : మహిళల ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ (WPGT) 9వ దశకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీకి స్టార్ గోల్ఫర్ హితాశీ బక్షి (Hitaashee Bakshi) రీఎంట్రీ ఇవ్వడం ప్రధాన ఆకర్షణగా మారింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న క్లోవర్ గ్రీన్స్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగే ఈ పోటీలో హితాశీ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సీజన్‌లో దేశీయ టూర్‌లో హితాశీ ఆడడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆమె లేడీస్ యూరోపియన్ టూర్‌లో పాల్గొంది. అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో మళ్లీ స్వదేశీ టూర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అయితే హితాశీకి ఈసారి పోటీ గట్టిగానే ఉండనుంది. వాణి కపూర్, రిధిమా దిలావరీ, అమన్‌దీప్ ద్రాల్ వంటి అనుభవజ్ఞులు బరిలో ఉన్నారు. అలాగే అన్విత నరేందర్, మన్నత్ బ్రార్, రియా, లావణ్య జాదోన్, అమేచ్యూర్ మహ్రీన్ భాటియా వంటి యువ గోల్ఫర్లు కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల యువ ఆటగాళ్లు సీనియర్లకు గట్టి సవాల్ విసురుతుండటంతో ఈసారి పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ టోర్నీలో మొత్తం 58 మంది క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. వారిలో 10 మంది అమేచ్యూర్లు ఉన్నారు. టోర్నీ ప్రైజ్ మనీ రూ.17 లక్షలు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఎనిమిది టోర్నీల్లో రిధిమా దిలావరీ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆమె మూడు టైటిళ్లు గెలుచుకుంది. జాస్మిన్ శేఖర్, ట్వేసా మాలిక్, అమేచ్యూర్ లావణ్య గుప్తా, అన్విత నరేందర్, మన్నత్ బ్రార్ ఒక్కో టైటిల్ సాధించారు. ప్రస్తుతం హీరో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో కూడా రిధిమా అగ్రస్థానంలో ఉంది.
జాస్మిన్ శేఖర్ రెండో స్థానంలో, అమన్‌దీప్ ద్రాల్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఆరో దశలో రిధిమా అద్భుతంగా పుంజుకుని మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. తొలి రెండు హోల్స్‌లో బోగీలు చేసినా, తర్వాత రెండు బర్డీలతో తిరిగి రేసులోకి వచ్చింది. చివరి హోల్ వరకు జాస్మిన్ శేఖర్‌తో హోరాహోరీగా పోరాడి విజేతగా నిలిచింది. ఇప్పుడు హితాశీ రీఎంట్రీతో హోసూర్‌లో జరిగే 9వ దశ టైటిల్ పోరు మరింత ఉత్కంఠగా మారింది.

