కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటింగ్ ప్రపంచం రోజుకో కొత్త పదంతో ముందుకు వస్తోంది. ఇటీవల యువతను బాగా ఆకట్టుకుంటున్న సరికొత్త ట్రెండ్ వైల్డ్‌ఫ్లవరింగ్ (Wild Flowering). బంబుల్ డేటింగ్ యాప్ ఈ కొత్త పదాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా డేటింగ్ అనగానే త్వరగా పెళ్లి లేదా నిశ్చితార్థం వైపు అడుగులు వేయడం వంటివి చూస్తుంటాం. కానీ, దానికి భిన్నంగా తొందరపాటు లేకుండా బంధాన్ని సహజంగా సాగనివ్వడాన్నే ఈ ‘వైల్డ్‌ఫ్లవరింగ్’. ప్రకృతిలో పూలు ఎలాగైతే తమంతట తాముగా వికసిస్తాయో, బంధాలు కూడా అలాగే సహజంగా బలపడాలనేది దీని ముఖ్య ఉద్దేశం.
లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ ట్రెండ్ ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వెంటనే రిలేషన్‌షిప్ ఆశించడం ఎక్కువైంది. దానికి భిన్నంగా ఈ వైల్డ్‌ఫ్లవరింగ్ పద్ధతి భాగస్వామ్యుల మధ్య మానసిక భద్రతను పెంపొందిస్తుంది. బంధాన్ని నిదానంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది.
ఈ అందమైన ‘వైల్డ్‌ఫ్లవరింగ్’ కాన్సెప్ట్‌లో చిన్న చిక్కు కూడా ఉంది. ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు మైండ్‌ఫుల్ డేటింగ్‌గా భావిస్తే, మరొకరు సరైన కమిట్‌మెంట్ ఇవ్వకుండా వాడుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ అలా జరిగితే ఆ బంధం పక్కదారి తప్పే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. నిజాయితీగా ముందడుగు వేసినప్పుడే ఈ వైల్డ్‌ఫ్లవరింగ్ బంధం వికసిస్తుంది.

