కలం, తెలంగాణ బ్యూరో : మహిళా స్వయం సహాయక సంఘాలు ఇక ఎంతమాత్రమూ పొదుపు సంఘాలు మాత్రమే కావని, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక నిర్మాణాన్ని మార్చే శక్తి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో మహిలలు కీలక భాగస్వాములుగానే కాక మైక్రో బిజినెస్ రంగంలో ఎంట్రిప్రెన్యూర్‌లుగా మారుతున్నారని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. వ్యాపార రంగంలో వారు కొత్త శక్తి అని అభివర్ణించారు. ‘ఇందిరా మహిళా శక్తి’ (Indira Mahila Shakti) కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే మహిళా సంఘాలు ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారని సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నది.
మహిళా సంఘాలతో గ్రామీణ వ్యవస్థకు కొత్త రూపం :
మహిళలకు అవకాశాలు కల్పించడంతోనే సరిపెట్టుకోకుండా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ‘అమ్మ ఆదర్శ కమిటీలు’, ఆర్టీసీకి అద్దె బస్సులను సమకూర్చే వ్యవస్థ, సొంతంగా పెట్రోలు బంకులు నిర్వహించుకునే మెలకువలు.. ఇలా చేయి చాపే పరిస్థితి నుంచి చేయి అందించేవైపు ప్రభుత్వం వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళలను భాగస్వాముల్ని చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని వారు తయారుచేసే ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా హైదరాబాద్‌లో శిల్పారామంలో స్టాల్స్ సమకూర్చడం మొదలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో వారి ఉత్పత్తులు విక్రయించుకునే సౌకర్యాన్నీ కల్పించింది. వారి ఆర్థికాభివృద్ధి అటు గ్రామీణ అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతికీ దోహదపడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. పారిశ్రామికవేత్తుగా నిలదొక్కుకునేందుకు బ్యాంకుల నుంచి లోన్ లింకేజీతో పాటు వడ్డీలేని రుణాలకూ భరోసా కల్పిస్తున్నది.
రాష్ట్రంలో మహిళా సంఘాల సమగ్ర స్వరూపం :
• రాష్ట్రంలో 46.68 లక్షల మంది గ్రామీణ పేద మహిళలు 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు.
• 17,650 గ్రామ సంస్థలు, 553 మండల మహిళా సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు, నాలుగు మహా సమాఖ్యలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మహిళా నెట్‌వర్క్.
• సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వార 91 వేల మందికిపైగా కొత్త మహిళా నాయకులు తయారయ్యారు.
• మహిళా సంఘాల ఆధారంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రుణ అనుసంధానం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం.
• గత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ. 20 వేల కోట్లే అయినా దానిని అధిగమిస్తూ రూ.25,228 కోట్ల రుణం.
• మార్చి 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల రుణ బకాయిలు రూ. 38,068 కోట్లకు చేరినా రికవరీ వ్యవస్థ బలంగా ఉండటంతో బ్యాంకులూ ఆసక్తి చూపుతున్నాయి.
• మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల్లో నిరర్థక ఆస్తుల ఒకటిన్నర శాతం లోపే. బ్యాంకింగ్ రంగంలోని ఇతర ప్రాధాన్య రంగాలతో పోలిస్తే చాలా తక్కువ. మహిళల్లో అప్పు తిరిగి చెల్లించే క్రమశిక్షణ బలంగా ఉందనే భావన.
• అర్హులైన అన్ని మహిళా సంఘాలను బ్యాంకు లింకేజీలోకి తీసుకొచ్చి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు తొలగించాలనే ఆలోచనపై కసరత్తు.
• గడచిన రెండేండ్లలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పడిన సుమారు 2.36 లక్షల మైక్రో వ్యాపారాలకు రూ. 60,487 కోట్ల బ్యాంకు లింకేజీ.. రూ.4,166 కోట్ల ఆర్థిక ప్రగతి.
• మహిళలకు ఆదాయ వనరులు కల్పించడంతో పాటు గ్రామీణ ఉపాధి వ్యవస్థ బలోపేతం. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుదల.
• ‘ఇందిరా మహిళా శక్తి’తో రాష్ట్రవ్యాప్తంగా 222 మహిళా సంఘాల క్యాంటీన్ల ఏర్పాటు. ఒక్కో యూనిట్ నెలకు సగటున రూ.72 వేల వరకు లాభార్జన.
• మహిళల నిర్వహణలో పెట్రోల్ బంకుల ఏర్పాటు. తొలి యూనిట్‌కు ఆరు నెలల్లోనే రూ. 13.82 లక్షల లాభం. త్వరలో మరో 30 యూనిట్లు ప్రారంభానికి సన్నాహాలు.
• మహిళా సమాఖ్యలు రూ. 199 కోట్ల పెట్టుబడితో 593 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన సరఫరా. అన్ని జిల్లాల్లో 3,195 వరి కొనుగోలు కేంద్రాలతో కమిషన్ ఛార్జీల రూపంలో రూ. 158 కోట్ల మేర ఆదాయం. పాల విక్రయ కేంద్రాల ఏర్పాటు.
• వడ్డీ లేని రుణాల పథకం కింద 4.38 లక్షల మహిళా సంఘాలకు రూ.1,397 కోట్లకు పైగా వడ్డీ రాయితీ. దాదాపు 48 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం. మహిళలకు అధిక వడ్డీ రుణ భారం నుంచి ఉపశమనం.
• మహిళా సంఘాలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడంతో 2,993 క్లెయిమ్‌లకు ఇన్సూరెన్సు కంపెనీల నుంచి రూ.23.72 కోట్లు ప్రయోజనం. ప్రతీ ప్రమాద మరణానికి రూ. 10 లక్షల చొప్పున బీమా.

