కలం, నేషనల్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) దేశ రాజకీయ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి.. అత్యధిక రోజులు దేశ ప్రధానిగా కొనసాగిన రికార్డును ఆయన ఈ నెల 10న సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ సుదీర్ఘ కాలపు రికార్డును మోదీ అధిగమించనున్నారు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల అనంతరం 1952, మే 13న నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964, మే 27న మరణించేంత వరకు ప్రధానిగా కొనసాగి మొత్తం 4,398 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు.
2014, మే 26న మొదటిసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోదీ.. అప్పటినుంచి నేటివరకు నిరంతరాయంగా పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీ నాటికి మోదీ పదవీ కాలం 4,399 రోజులకు చేరుకుంటుంది. దీంతో ఎన్నికైన ప్రధానిగా అత్యధిక రోజులు దేశాన్ని పాలించిన నేతగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఇందిరా గాంధీ రికార్డును సైతం దాటేసి.. నరేంద్ర మోదీ గతంలోనే వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రికార్డును సైతం బద్దలు కొట్టారు. 1966, జనవరి 24న ప్రధాని అయిన ఇందిరా గాంధీ.. 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. మోదీ గతేడాది (జులై 5, 2025) నాటికే ఇందిరా గాంధీ వరుస పదవీ కాలాన్ని దాటేసి ముందుకు సాగుతున్నారు.
నెహ్రూ కాలానికి.. ఇప్పటికి మారిన భారత్
అయితే నెహ్రూ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటికి దేశ జనాభా దాదాపు 34 కోట్లు మాత్రమే. కానీ, మోదీ 2014లో బాధ్యతలు తీసుకునే సమయానికి దేశ జనాభా 131 కోట్లకు చేరగా.. ప్రస్తుతం అది 146 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. జనాభాతో పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిణతి, రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది.

