కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులు వాహనాలకన్నా పశువుల సంచారానికి నిలయాలుగా మారుతున్నాయి. ఆవులు, ఎద్దులు, గేదెలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పశువులు రోడ్ల మధ్యలోనే పడుకోవడం, ఒక్కసారిగా వాహనాల ముందుకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత యజమానుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలేయొద్దని, వెంటనే తమ సొంత స్థలాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు గత నెల రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ప్రెస్ నోట్ లు విడుదల చేసి హెచ్చరించారు.
అయినప్పటికీ పలువురు పశు యజమానులు ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యథావిధిగా పశువులను రోడ్లపై వదిలేస్తున్నారు. పట్టణంలోని బైల్బజార్, తిరుమల టాకీస్, బస్టాండ్, జయశంకర్ చౌరస్తా, ఆర్డీఓ కార్యాలయం, బస్ డిపో, శివాజీ చౌక్, శాస్త్రినగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పశువులను వదిలే యజమానులపై జరిమానాలు, పశువుల స్వాధీనం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కఠిన చర్యలు ఎప్పుడో?
మున్సిపల్ అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఇకపై నిబంధనలు ఉల్లంఘించే పశు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక హెచ్చరికలతోనే సరిపెడతారా? అన్నది పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యపై వెంటనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

