కలం, స్పోర్ట్స్: ఫిఫా పురుషుల ప్రపంచకప్ 1930లో ఉరుగ్వే వేదికగా కేవలం 13 జట్లతో ప్రారంభమై.. 96 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేడుకగా ఎదిగింది. తొలి టోర్నీలో ఉరుగ్వే విజేతగా నిలవగా, అప్పటి నుంచి ఫార్మాట్, సాంకేతికత, పాల్గొనే దేశాల సంఖ్యలో ఎన్నో మార్పులు వచ్చాయి.
48 జట్లు..
గతంలో ఫిపా వరల్డ్ కప్‌లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి. 2026 నుంచి జట్ల సంఖ్యను 48కి పెంచారు. దీంతో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, హైతీ వంటి కొత్త జట్లకు కూడా ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై తమ ప్రతిభను చూపించే అవకాశం లభించింది.
మూడు ఆతిథ్య దేశాలు
చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ కు మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. అమెరికా, మెక్సికో, కెనడా కలిసి ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చాయి.
104 మ్యాచ్‌లు
48 జట్ల ఫార్మాట్ కారణంగా మొత్తం మ్యాచ్ల సంఖ్య 64 నుంచి 104కు పెరిగింది. టోర్నమెంట్ వ్యవధి కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులకు విస్తరించింది.
కొత్తగా రౌండ్ ఆఫ్ 32
ఈసారి గ్రూప్ దశలో 12 గ్రూపులుగా జట్లు పోటీపడ్డాయి. ప్రతి గ్రూప్లో టాప్-2 జట్లతో పాటు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన 8 మూడో స్థాన జట్లు కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. దీంతో తొలిసారిగా ‘రౌండ్ ఆఫ్ 32’ దశ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
మ్యూజిక్ షో
అమెరికాలోని సూపర్ బౌల్ తరహా వినోదాన్ని పోలిన విధంగా ఫిఫా వరల్డ్కప్ ఫైనల్లో తొలిసారిగా ప్రత్యేక హాఫ్టైమ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షకీరా (కొలంబియా), మడోన్నా (క్వీన్ ఆఫ్ పాప్ – అమెరికా), బీటీఎస్ (దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్) వంటి వంటి గ్లోబల్ స్టార్స్ తో షో నిర్వహించారు.
టెక్నాలజీ విప్లవం
ఆట పరంగానే కాదు, టెక్నాలజీ పరంగానూ ఫుట్ బాల్ చరిత్రను ఫిఫా–2026 మార్చేసింది. మైదానంలో అంపైర్ల నిర్ణయాలను సరిచేయడం దగ్గరనుంచి, కోచ్ ల వ్యూహాల వరకు ప్రతి చోటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక అదృశ్య శక్తిలా పనిచేసింది.
ఫుట్‌బాల్‌లో చిప్
ఈ టోర్నీ అధికారిక మ్యాచ్ బాల్ ‘ట్రియోండా’ లోపల అడిడాస్ సంస్థ ఒక ప్రత్యేకమైన ఏఐ చిప్ అమర్చింది. ఇది సెకనుకు ఏకంగా 500 సార్లు డేటాను ట్రాక్ చేసింది.
3డీ ప్లేయర్ అవతార్స్
టోర్నీలో పాల్గొన్న మొత్తం 1,248 మంది ఆటగాళ్లను లైనోవో టెక్నాలజీ సహాయంతో 3డీ స్కానింగ్ క్యాబిన్లలో డిజిటల్ అవతార్లుగా మార్చారు. మైదానంలో అమర్చిన హై-స్పీడ్ ట్రాకింగ్ కెమెరాలు ఈ అవతార్ల సహాయంతో ప్లేయర్ల శరీరంలోని 29 స్కెలెటల్ పాయింట్స్ (కీళ్లు, కదలికలు) ట్రాక్ చేశాయి. దీనివల్ల క్లిష్టమైన ‘ఆఫ్సైడ్’ నిర్ణయాలను 3డీ యానిమేషన్ రూపంలో స్క్రీన్పై చూపిస్తూ కచ్చితమైన తీర్పు ఇచ్చారు.
రెఫరీ బాడీకామ్స్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు రెఫరీల యాంగిల్ నుంచి వీక్షకులకు లైవ్ అనుభూతిని ఇవ్వడానికి వారి చొక్కాలకు బాడీ కెమెరాలను అమర్చారు. రెఫరీలు మైదానంలో వేగంగా పరిగెత్తినప్పుడు విజువల్స్ బ్లర్ అవ్వకుండా లైనోవో ఏఐ మోషన్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ అద్భుతంగా పని చేసింది. ఇవే కాకుండా మరెన్నో టెక్నాలజీలను ఈ టోర్నీలో వాడారు.
వ్యాపార పరంగానూ కళ్లు చెదిరే రికార్డులు
వ్యాపార పరంగానూ ఈ టోర్నీ కళ్లు చెదిరే రికార్డులను సృష్టించింది. జట్ల సంఖ్య 48కి పెరగడం, మ్యాచ్లు ఎక్కువ కావడంతో ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అపారమైన లాభాలను ఆర్జించింది.
ఆల్ టైం రికార్డు రెవెన్యూ
ఈ టోర్నమెంట్ ద్వారా ఫిఫా ఏకంగా15 బిలియన్ల డాలర్లు (సుమారు రూ. 1,25,000 కోట్లు) ఆదాయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. మొదట11 బిలియన్లు వస్తుందని అంచనా వేయగా, టికెట్ల అమ్మకాలు, హాస్పిటాలిటీ ద్వారా ఊహించని రీతిలో భారీ లాభాలు వచ్చాయి. గత 2022 ఖతార్ వరల్డ్కప్ ఆదాయం (7.6 బిలియన్లు) తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు!
వేలానికి మెస్సి జెర్సీ
అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్ మ్యాచ్ లో వాడిన ఒరిజినల్ ఫుట్ బాల్ తోపాటు, హాఫ్-టైమ్ మ్యూజిక్ షోలో గ్లోబల్ పాప్ స్టార్ షకీరా ధరించిన దుస్తులను వేలం వేస్తున్నారు. అలాగే మెస్సి సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని కూడా వేలం పెడుతున్నారు. దీని ద్వారా వచ్చే నిధులను పేద పిల్లల విద్య, క్రీడల నిధికి అందిస్తారు. జులై 22 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు.
అమ్మకానికి గడ్డి
ఫుట్ బాల్ హిస్టరీలోనే మొదటిసారిగా, మెట్లైఫ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగిన ఒరిజినల్ గడ్డి పిచ్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి (3×3 ఇంచులు) అభిమానులకు జ్ఞాపికలుగా అమ్ముతున్నారు. ఒక్కో బాక్స్ లో పిచ్ ముక్కతో పాటు గోల్డ్-ఎచ్చెడ్ రెప్లికా టికెట్, మినీ ట్రోఫీని కలిపి 450 నుంచి 1,200 డాటర్లు (రూ. 37 వేల నుంచి రూ. ఒక లక్ష) ధరల్లో విక్రయిస్తున్నారు.
ఫిఫా ఉంగరాలు
ఫిఫా 96 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా, ఈసారి ప్రపంచకప్ విజేతలకు ఐకానిక్ ట్రోఫీ, గోల్డ్ మెడల్స్ తోపాటు అధికారిక ఛాంపియన్ షిప్ ఉంగరాలు ప్రవేశపెట్టారు. ఈ మెగా టోర్నమెంట్ కు గుర్తుగా కేవలం 2,026 ప్రత్యేకమైన లగ్జరీ ఉంగరాలను మాత్రమే డిజైన్ చేయగా, ఇందులో ఫైనల్ విజేత జట్టు ఆటగాళ్లు, కోచ్ లకు కలిపి మొత్తం 30 ఉంగరాలు కేటాయించారు. ఫిఫా ట్రోఫీ ఆకృతితోపాటు విజేత దేశపు జాతీయ ముద్రతో రూపొందించిన ఈ లగ్జరీ ఉంగరాలలో మిగిలిన 1,996 ఉంగరాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులైన ఫుట్ బాల్ అభిమానుల కోసం ఓపెన్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు.
రికార్డు ప్రైజ్ మనీ
2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం భారీ ప్రైజ్ పూల్ ను ప్రకటించారు. మొత్తం 655 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 5,470 కోట్లు) బహుమతి మొత్తాన్ని కేటాయించారు. ఇది 2022 ఖతార్ వరల్డ్ కప్ తో పోలిస్తే ఏకంగా 50 శాతం ఎక్కువ.
విజేత జట్టుకు: 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 418 కోట్లు)
రన్నరప్: 33 మిలియన్ల డాలర్లు (రూ. 275 కోట్లు)
మూడో స్థానం: 29 మిలియన్ల డాలర్లు ( రూ. 242 కోట్లు)
నాలుగో స్థానం: 27 మిలియన్ల డాలర్లు ( రూ. 225 కోట్లు)
క్వార్టర్ ఫైనలిస్టులు: ఒక్కో జట్టుకు19 మిలియన్ల డాలర్లు ( రూ.159 కోట్లు)
రౌండ్ ఆఫ్ 16 జట్లు: ఒక్కో జట్టుకు15 మిలియన్ల డాలర్లు ( రూ.125 కోట్లు)
రౌండ్ ఆఫ్ 32 జట్లు: ఒక్కో జట్టుకు 11 మిలియన్ల డాలర్లు (రూ.92 కోట్లు)
గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించే జట్లు: ఒక్కో జట్టుకు 9 మిలియన్ల డాలర్లు (రూ.75 కోట్లు)
* దీనితో పాటు అర్హత సాధించిన ప్రతి జట్టుకు టోర్నీ సన్నాహక ఖర్చుల కోసం అదనపు నిధులు అందనున్నాయి. అందుకే 2026 వరల్డ్ కప్ కేవలం ప్రతిష్ఠాత్మక టోర్నీ మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా అత్యంత భారీ క్రీడా ఈవెంట్.

