కలం, నేషనల్ డెస్క్ : ఇండియాలో గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా వడగాల్పుల తీవ్రత ఏటా రికార్డు స్థాయికి చేరుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో దేశంలో సంభవిస్తున్న మరణాలపై తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 5 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తే.. ఏకంగా 8,056 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. దీంతో దేశంలోనే వడగాల్పుల (Heatwave) వల్ల అత్యధిక మరణాలు సంభవించే ప్రమాదకరమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. భూమిపై అత్యంత వేడి సంవత్సరంగా నమోదైన 2024 నాటి వడగాల్పుల మరణాల డేటా.. జనాభా అంచనాలు, చారిత్రక వాతావరణ నమూనాలను విశ్లేషించి పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.
వడగాల్పులు.. ప్రాణాంతకం
ఉత్తరప్రదేశ్‌లో అంచనా వేసిన 8,056 మరణాలు.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న బీహార్ కంటే రెండింతలు ఎక్కువ. బీహార్‌లో ఈ సంఖ్య 3,615గా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (2,964 మరణాలు), రాజస్థాన్ (2,664 మరణాలు) ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే.. కేవలం ఒక్క రోజు అత్యంత ప్రమాదకరమైన వేడి వాతావరణం ఉంటే సుమారు 3,400 మంది అదనంగా మరణించే అవకాశం ఉందని పరిశోధకుల బృందం తెలిపింది. అదే 5 రోజుల పాటు వడగాల్పులు కొనసాగితే.. దేశవ్యాప్తంగా దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ మొత్తం మరణాలలో 8,000 కంటే ఎక్కువ ఒక్క యూపీలోనే సంభవించే అవకాశం ఉండటం గమనార్హం.
యూపీలోనే అత్యధిక మరణాలు ఎందుకు?
ఉత్తరప్రదేశ్‌లో ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడటానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. యూపీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కావడం, సాధారణ రోజుల్లోనే అక్కడ రోజువారీ మరణాల రేటు ఎక్కువగా ఉండటం, వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరడం దీనికి కారణం. ఇంతటి భారీ జనాభా, జనసాంద్రత ఉన్న రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత స్వల్పంగా పెరిగినా.. వేలాది మరణాలకు దారితీస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్.. ఈ ఐదు రాష్ట్రాల జనాభా దేశ మొత్తం జనాభాలో 43 శాతం మాత్రమే. కానీ, దేశంలో వడగాల్పుల వల్ల సంభవించే మొత్తం మరణాల భారాన్ని పరిశీలిస్తే.. 60 శాతానికి పైగా మరణాలు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.
డేంజర్ జోన్లో ప్రయాగ్‌రాజ్, లక్నో
యూపీలోని ప్రయాగ్‌రాజ్, లక్నో, కాన్పూర్ నగర్, అజామ్‌గఢ్, ఆగ్రా, బరేలి జిల్లాలు అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉన్నాయి. 5 రోజుల వడగాల్పుల కాలంలో ప్రతి జిల్లాలో 180కి పైగా అదనపు మరణాలు సంభవించవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కేవలం అహ్మదాబాద్, జైపూర్, సూరత్ నగరాలే ఇంతకంటే ఎక్కువ సంఖ్యను నమోదు చేసే అవకాశం ఉంది. ఇండో-గంగా మైదాన ప్రాంతాల్లోని పెద్ద పట్టణాలు, దట్టమైన జనసాంద్రత గల జిల్లాల్లో ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

