భిన్న స్వభావాలు.. ఒకే లక్ష్యం!

కలం, స్పోర్ట్స్ బ్యూరో : లార్డ్స్ సాక్షిగా ‘రో-కో’ (Rohit – Kohli) జోడీ సరికొత్త చరిత్ర లిఖించింది. 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి మునుపెన్నడూ లేని అరుదైన మైలురాయిని అందుకుంది. గతంలో సచిన్- ద్రవిడ్ (391 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును ఎప్పుడో అధిగమించి ఈ జోడీ.. నేడు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అయితే, ఇది కేవలం పొడిపొడి గణాంకాల సంఖ్య కాదు.. దాదాపు దశాబ్దంన్నరగా ఒకరినొకరు కాపాడుకుంటూ, దేశాన్ని గెలిపిస్తూ సాగిన ఇద్దరు యోధుల ఆత్మీయ ప్రయాణం. కాలం మారినా.. నాయకత్వాలు మారినా.. కెరీర్ ఒడిదొడుకుల్లోనూ.. ఒకరికొకరు కొండంత అండగా నిలిచిన వీరి బంధం.. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అధ్యాయం.

రోహిత్ ముంబై వీధుల నుంచి వచ్చిన ప్రశాంతత, క్లాసిక్ టైమింగ్‌కు నిదర్శనమైతే.. కోహ్లీ ఢిల్లీ మైదానాల నుంచి వచ్చిన దూకుడు, అంకితభావానికి ప్రతీక. స్వభావంలో ఇద్దరూ భిన్న ధృవాలే. అయినప్పటికీ మైదానంలోకి అడుగుపెడితే దేశాన్ని గెలిపించాలనే విషయంలో వారిద్దరిదీ ఒకే లక్ష్యం. ఒకరు ప్రత్యర్థులపై పుల్ షాట్లతో విరుచుకుపడుతుంటే.. మరొకరు కవర్ డ్రైవ్స్తో పరుగుల వేట సాగిస్తూ టీమిండియా బ్యాటింగ్ విభాగానికి రెండు కళ్లుగా నిలిచారు.

ఒడిదొడుకుల్లో వెన్నంటిన స్నేహం

విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి మూడేళ్ల పాటు సెంచరీ కోసం తపించినప్పుడు, బయట ప్రపంచం మొత్తం అతడిపై విమర్శలు గుప్పించింది. కానీ, అప్పటి కెప్టెన్గా రోహిత్ శర్మ మాత్రం ప్రతీ ప్రెస్ మీట్లో విరాట్కు కొండంత అండగా నిలిచాడు. ‘కోహ్లీ సత్తా ఏంటో మాకు తెలుసు, బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా మాకు అనవసరం’ అంటూ రోహిత్ ఇచ్చిన భరోసా విరాట్‌కు ఎంతో బలాన్నిచ్చింది.

అలాగే రోహిత్ శర్మ ఫిట్నెస్, కెప్టెన్సీపై విమర్శలు వచ్చినప్పుడు.. విరాట్ ఒక సీనియర్ ప్లేయర్ గా, ఒక నమ్మకమైన స్నేహితుడిగా రోహిత్ వెనుక నిలబడ్డాడు. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తున్నప్పుడు కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి రోహిత్‌కు సలహాలు ఇవ్వడం వీరిద్దరి మధ్య ఉన్న అపురూపమైన అనుబంధానికి అద్దం పట్టింది.

కెప్టెన్సీ మారినా.. చెరగని బంధం

కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా తన వ్యూహాలతో సహాయం చేశాడు. ఆ తర్వాత నాయకత్వ బాధ్యతలు రోహిత్ చేతికి వచ్చినప్పుడు, కోహ్లీలో ఎలాంటి ఈగో కనిపించలేదు. రోహిత్ కెప్టెన్సీలో విరాట్ ఎంతో ఉత్సాహంగా ఆడాడు. ప్రత్యర్థుల వికెట్ పడిన ప్రతిసారీ రోహిత్ కంటే ముందే సంబరాలు చేసుకునేవాడు. నాయకత్వ మార్పిడి వీరి మధ్య దూరాన్ని పెంచకపోగా, బంధాన్ని మరింత బలోపేతం చేసింది.

కన్నీళ్లు పెట్టించిన ఆత్మీయం

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ గెలుపు ఆనందంలో, టీ20 కెరీర్ ముగింపు వేళ.. ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు (Rohit – Kohli) గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఇద్దరూ కలిసి చేతబూని మైదానమంతా తిరిగిన దృశ్యం, వారి మధ్య ఉన్న బంధం కేవలం రికార్డుల కోసం కాదని, దేశం కోసం ఒకరికొకరు తోడుగా సాగించిన సుదీర్ఘ పయనమని నిరూపించింది. సచిన్-ద్రవిడ్ యుగం తర్వాత భారత క్రికెట్ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలిపిన ఘనత రోహిత్-కోహ్లీలదే. లార్డ్స్ వేదికగా నమోదైన ఈ 400వ ఉమ్మడి మ్యాచ్ కేవలం ఒక గణాంకం కాదు, భారత క్రికెట్ అనే ఆకాశంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన రెండు ధృవతారల అద్భుత ప్రయాణానికి సజీవ సాక్ష్యం.

లార్ట్స్ లో గెలిచింది ఆ ఇద్దరే..!

లార్డ్స్ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యం, మరోవైపు రిటైర్మెంట్ చర్చల మధ్య తమ 400వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్, కోహ్లీ జట్టుకు కొండంత అండగా నిలిచారు. విమర్శలకు సమాధానంగా రోహిత్ (138) లార్డ్స్ వన్డే చరిత్రలోనే తొలి భారత బ్యాటర్గా శతకం బాదగా, క్రాంప్స్‌తో ఇబ్బంది పడుతున్న అతడికి కోహ్లీ (అర్ధశతకం) నాన్స్ట్రైకర్ ఎండ్ నుంచి కొండంత భరోసానిచ్చాడు. రోహిత్ సెంచరీ పూర్తయిన వెంటనే విరాట్ పరుగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్న క్షణం.. కేవలం ఇద్దరు ఆటగాళ్ల ఆనందమే కాదు, ఏళ్లుగా కొనసాగుతున్న ఓ అరుదైన అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. దురదృష్టవశాత్తూ టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. అభిమానుల గుండెల్లో గెలిచింది మాత్రం ఈ ఇద్దరే.

Read Also: అమ్మ ఇప్పటికీ తిడుతుంది.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>