కలం, నల్లగొండ: జిల్లాలోని చిట్యాల (Chityala ) పరిసర ప్రాంతాల్లో దొంగలు అర్ధరాత్రి వేళ విరుచుకుపడుతున్నారు. గత రెండు రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలను, రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. చిట్యాల మండల పరిధిలోని పిశాటిగూడెం, పేరేపల్లి గ్రామాలలో అర్ధరాత్రి వేళ దొంగలు హల్చల్ చేశారు. వ్యవసాయ బావుల వద్ద దుక్కులు దున్నేందుకు ఉంచిన ట్రాక్టర్ల నుంచి మూడు బ్యాటరీలను దుండగులు ఎత్తుకెళ్లారు.
అంతేకాదు పేరేపల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీని కూడా కేటుగాళ్లు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం. అటు ఉరుమడ్ల గ్రామంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం సమీపంలోనూ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వేళ మూడు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి, మోటార్ కేబుళ్లను కట్ చేసి వాటిలోని ఖరీదైన కాపర్ వైర్లను తీసుకెళ్లారు. గత రెండు రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఏకంగా 6 వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు బాధితులు వాపోతున్నారు.
గత రెండు రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ చోరీలతో ఏ క్షణంలో ఏ వస్తువు పోతుందోనని రైతులు, గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వరుస దొంగతనాలపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, కేటుగాళ్ల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. రాత్రివేళల్లో గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

