కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం-విశాఖపట్నం (Bhadrachalam–Visakhapatnam) రోడ్డు కారిడార్ అభివృద్ధిపై బుధవారం రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రస్తావించారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అనుసంధానత, ట్రాఫిక్ సాంద్రత, ‘పీఎం గతి శక్తి’ ప్లాన్ ఆధారంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో రూ. 2,170 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు. అందులో రూ. 1,711 కోట్లు గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించామని చెప్పారు. భద్రాచలం నుంచి చింతూరు వరకు NH-30ని ఇప్పటికే రెండు లేన్లుగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. అక్కడ నుండి సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, తాళ్లపాలెం మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారి ద్వారా ఆరు లేన్ల NH-16ని అనుసంధానించి విశాఖపట్నానికి రవాణా సౌకర్యం కల్పించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

