అన్నదాతలకు అలర్ట్.. పీఎం కిసాన్‌లో కొత్త రూల్ !

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ పథకం (PM Kisan)ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోన్న విషయం తెలిసిందే. మార్చి 2026లో 22వ విడత పీఎం కిసాన్ నిధులు నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కాగా.. అన్నదాతలు ఇప్పుడు 23వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ పథకంలో పారదర్శకత పెంచేందుకు.. కేవలం అర్హులైన వారికి మాత్రమే నిధులు విడుదల చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధనను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. 23వ విడత సాయం పొందాలంటే లబ్దిదారులు ఈ ఐడీని కచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

యూనిక్ ఫార్మర్ ఐడీ లేదా రైతు రిజిస్ట్రీ అనేది అన్నదాతలకు ఇచ్చే ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది. దీనిలో రైతులు తమ భూమి వివరాలు, పంటలకు సంబంధించిన సమాచారం, ఎరువుల వినియోగం, పోషణ చర్యలు, పశుపోషణ, ఆదాయానికి సంబంధించిన ఇతర కీలక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం రైతులు మళ్లీ మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. అలానే విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను వేగవంతంగా పొందేందుకు అవకాశం లభిస్తుంది. యూనిక్ ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. రైతులు తమ రాష్ట్ర అధికారిక ‘అగ్రిస్టాక్’ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

కాగా, రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు గాను పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో కేంద్రం జమ చేస్తోంది. 23వ విడత 2026 జూన్, జూలైలో విడుదల చేస్తారని కేంద్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>