కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలో వ్యభిచార గృహం (Prostitution House) పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. కాంట్రాక్టర్స్ కాలనీలో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు, ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ మహిళ, కాంట్రాక్టర్స్ కాలనీని కేంద్రంగా చేసుకుని హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు, మధ్యతరగతి గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొదట వివిధ అవసరాల పేరుతో మహిళలను సంప్రదించి, తర్వాత వారిని ఈ అక్రమ కార్యకలాపాల్లోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిక్కుకున్న వారిని రహస్య వీడియోలతో బెదిరిస్తూ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాడుల్లో పట్టుబడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

