కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి (Ajit Pawar Plane Crash) ప్రధాన కారణం ఏమిటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ అక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది. పైలట్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగానే విమానప్రమాదం జరిగి ఉండొచ్చని విచారణ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.
లియర్‌జెట్ 45 విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ (Ajit Pawar Plane Crash) అయి అగ్నికి ఆహుతి అయింది. విమానంలో ఉన్న వారంతా స్పాట్‌లోనే మరణించారు. విమానాన్ని రెండో సారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బారామతి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమయంలో ఏమీ కనిపించకపోవడం, పైలట్ తప్పుడు నిర్ణయమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తొలుత భావించారు. అయితే పైలట్ మిస్‌జడ్జ్‌మెంట్ కూడా ప్రమాదానికి మరో కారణమని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. విమానాన్ని పుణే విమానాశ్రయానికి తరలించే అవకాశం ఉన్నప్పటికీ బారామతిలోనే ల్యాండ్ చేయాలని పైలట్ నిర్ణయించడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. అయితే బారామతిలోనే ల్యాండ్ చేయాలని పైలట్ మీద ఏదైనా ఒత్తిడి ఉందా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.
ఒత్తిడి కారణంగానేనా..
వీఐపీల విమానాలు, హెలికాప్టర్ ఆపరేషన్లలో షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ చేయాలనే ఒత్తిడి సాధారణమేనని, పొగమంచు కారణంగా రన్ వే ఏమీ కనిపించని పరిస్థితుల్లో ల్యాండిగ్‌కు ప్రయత్నం చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ అక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) గురువారం ఘటనా స్థలం వద్దకు చేరుకొని బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను విశ్లేషించి, ప్రమాద కారణాన్ని నిర్ధారించనున్నారు.


