కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారు. సహజంగా కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రం నుంచి పెద్దగా బయటకు రారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నప్పుడే ఆయన బయటకు వస్తారు తప్ప.. మాములు రోజుల్లో అడుగు బయటపెట్టరు. అయితే గురువారం ఆయన ఫామ్‌హౌస్ నుంచి బయటకొచ్చారు. తన వ్యవసాయక్షేత్రం పక్కన ఉన్న పంట పొలాలను కారులో తిరుగుతూ పరిశీలించారు. కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇలా బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిట్ నోటీసులను తాను లెక్కచేయడం లేదని సంకేతాలు ఇచ్చేందుకే ఆయన ఇలా చేశారా? అనే చర్చ జరుగుతోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే తన వ్యవసాయక్షేత్రం నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ కారులో బయటకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రేపు (శుక్రవారం) మధ్యాహ్నం కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే కేసీఆర్ (KCR) సిట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని అధికారులు మినహాయింపు ఇచ్చారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీగా జనసమీకరణ చేసింది. హరీశ్ రావు విచారణ సమయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కేసీఆర్ విచారణ సమయంలో ఏం జరగబోతున్నది? ఎంతమందిని తరలిస్తారు? అన్నది వేచి చూడాలి. కేసీఆర్ రేపు ఏ సమయంలో నందినగర్‌లోని నివాసానికి వస్తారో తెలియాల్సి వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ భారీగా జనసమీకరణ చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఆ దిశగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.


