కలం, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా సంక్రాంతికి రిలీజై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షుకులే కాదు ఇండస్ట్రీలోని పలువురి ప్రశంసలు దక్కాయి. తాజాగా మెగాస్టార్ సోదరుడు ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అభినందనలు తెలిపారు. ఆయన తన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో తన శుభాకాంక్షలు తెలిపడం విశేషం. దీంతో ఈ బ్యానర్ లో మెగాస్టార్ మూవీ ఉంటుందా అనే ఆశలు మెగా ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి కూడా ఈ బ్యానర్ లో నటిస్తే అది మరింత క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.
మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి, అలాగే మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ మొత్తానికి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా నిలుస్తూ.. అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. మెగాస్టార్ అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది అంటూ పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఇప్పటికీ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.


