ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయాలి : వేముల ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ. 3850 పలికిన ధర ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ కారణంగా రూ. 3450 వరకు పడిపోయి ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నస్టపోతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ఈ విషయమై ఆయన జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి (Ila Tripathi) తో ఫోన్‌లో మాట్లాడి ఎర్రజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎర్రజొన్న రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి పరమావధి కావాలని, రైతులను నష్టపరిచే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎర్రజొన్న సాగు, ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే చెప్పారు.

రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు మొగ్గుచూపడంతో ఎర్రజొన్న సాగు తగ్గిందని అన్నారు. గత సంవత్సరం 34000 ఎకరాల్లో ఎర్రజొన్న పంట ఉంటే ఈ సంవత్సరము 23000 ఎకరాలకు ఉత్పత్తి పడిపోయిందని అన్నారు.  ఉత్పత్తి తగ్గిన పరిస్థితుల్లో సహజంగా ధర పెరగాల్సి ఉండగా, వ్యాపారులు కలిసి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేయడం రైతులకు తీవ్ర అన్యాయం అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఎర్రజొన్నకు క్వింటాలుకు కనీసం రూ. 3850 నుంచి రూ. 4000 వరకు ధర రావాల్సి ఉండగా, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను రూ. 3400 నుంచి రూ. 3450 వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఎర్రజొన్న ధర తగ్గడానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ వ్యాపారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని, అక్కడ ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎర్రజొన్న రైతులు అందరు సంఘటితం కావాలని, గిట్టుబాటు ధర లభించకపోతే పోరాటానికి సిద్ధం కావాలని BRS పార్టీ మీకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పిలుపునిచ్చారు.

Read Also: దేశంలోనే రిచెస్ట్ మహిళా ఎమ్మెల్యేలు ఏపీలోనే.. ADR రిపోర్ట్‌

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>