కలం, వెబ్ డెస్క్: నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు (Nampally Fire Accident) సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన భవనంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకాలం ఇక్కడ అక్రమ కార్యకలాపాలు సాగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రమాదానికి గురైన భవనం 66 ఏళ్ల పాతదని తెలుస్తోంది. ఈ భవనాన్ని 1960లో ‘హిందీ ప్రచార సభ’ పేరుతో నిర్మించినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో కొందరు దాతలు ఇచ్చిన విరాళాలతో ఈ భవనం నిర్మాణం జరిగినట్టు సమాచారం. కాలక్రమేణా ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అసలు ఉద్దేశానికి భిన్నంగా, నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా భవనాన్ని ఆక్రమించి షాపులు, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా విస్మరించి వ్యాపారాలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమాలపై గతంలోనే హైకోర్టు స్పందించింది. భవనంలో ఏర్పాటు చేసిన అక్రమ షాపులను ఖాళీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం భేఖాతరు చేస్తూ వ్యాపార దందా కొనసాగుతున్నట్టు సమాచారం.
ప్రమాదం (Nampally Fire Accident) జరిగిన సమయంలో భవనంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పాత విద్యుత్ వైర్లు, ఇరుకైన మార్గాలు తీవ్రంగా నష్టాన్ని పెంచినట్టు ప్రాథమికంగా తేలింది. ఈ ఘటనతో అయినా అక్రమ నిర్మాణాలు, అక్రమ వ్యాపారాలపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: మున్సిపల్ ఎన్నికలకు ఇన్ చార్జులను నియమించిన బీఆర్ ఎస్
Follow Us On : WhatsApp


