కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) లో బీజేపీ (BJP) పార్టీ కకావికలం అవుతుంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ నేతల్లో కదలిక రావడం లేదు. పార్టీ లీడర్ల మధ్య అంతర్గత పోరు, క్యాడర్‌ను కమ్యూనికేట్ చేసే లీడర్ లేకపోవడం.. సీనియర్లు ఎవరి దారు వారు చూసుకుంటుండడంతో బీజేపీ లీడర్లలో జోష్ కన్పించడం లేదు. పార్టీ పదవుల విషయానికొచ్చేసరికి నువ్వా.. నేనా అంటూ ఘర్షణకు దిగే లీడర్లకు మున్సిపల్ ఎన్నికలు గెలుపు దిశగా క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు ముందుకు రాకపోవడం మరింతగా బీజేపీని కుదిపేస్తుంది. ప్రధానంగా తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) ఊవ్విళ్లూరుతుండగా.. బీజేపీ మాత్రం ఇంకా నేలచూపులు చూస్తుంది. కొన్ని డివిజన్లలో గెలిచే సత్తా ఉన్నప్పటికీ క్యాడర్‌లో ఊపు తెచ్చి ఎన్నికల దిశగా నడిపేందుకు ఎవ్వరూ చొరవ చూపకపోవడం గమనార్హం.
అన్ని డివిజన్లకు అభ్యర్థులు కరువే..
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కనీసం సగం డివిజన్లలోనైనా బీజేపీ పోటీ చేసే పరిస్థితి కన్పించడం లేదు. దీనికి జిల్లా నాయకత్వం సైతం ఓ కారణమనే చెప్పాలి. ఓవైపు రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఒక్కో వార్డుకు ఇద్దరు అభ్యర్ధులను సిద్దం చేసుకుంటున్నాయి. ఒకరు కాకపోతే మరొకరనే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ బీజేపీకి మాత్రం అన్ని డివిజన్లలో ఒక్క అభ్యర్థి కూడా దొరకడం లేదు. ఎంతసేపటికీ పిల్లి రామరాజుయాదవ్, బండారు ప్రసాద్, మొరిశెట్టి నాగేశ్వరరావు తదితర పేర్లు మినహా కొత్త క్యాడర్‌ను ప్రోత్సహించి ఎన్నికల్లో నిలబెట్టగలిగే నాయకుడు బీజేపీకి కరువయ్యారు. గెలిచే సత్తా ఉన్న సీనియర్ లీడర్లు పోటీ చేయకుండా.. ప్రత్యర్థి రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇంటర్నల్‌గా మద్దతు ఇస్తునట్లు తెలుస్తుంది.
లీడర్ల వర్గపోరుతో క్యాడర్‌లో నిరుత్సాహం..
నల్లగొండ బీజేపీలో వర్గపోరు చాపకింద నీరులా నడుస్తుంది. రెడ్డి లీడర్ల పెత్తనం ఎక్కువవడం, బీసీ లీడర్ల చేరికలపై ఫోకస్ పెట్టకపోవడం.. తదితర కారణాల నేపథ్యంలో ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడడం లేదు. ఇటీవల బీజేపీ లీడర్ పిల్లి రామరాజు యాదవ్( Pilli Rama Raju Yadav)పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshith Reddy) అనుచరులు దాడి చేయడం.. ఆ ఘటన కాస్త వివాదంగా మారడం కార్యకర్తలను డైలామాలో పడేసింది. రాష్ట్ర నాయకత్వం స్పందించి ఆ వివాదాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రాజకీయ వాతావరణం ఎక్కడా కన్పించడం లేదు. ఓవైపు రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతోంది. కానీ ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయలేదు.


