epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

మునుగోడులో నయా రాజ్యాంగం.. MLA రూల్స్ పాటించలేదని వైన్స్ నిర్వాహకులపై దాడి!

కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు (Munugodu) నియోజకవర్గంలో నయా రాజ్యాంగం నడుస్తోంది. తెలంగాణ మొత్తం ఒక ఎత్తయితే.. మునుగోడు నియోజకవర్గంలో మరో ఎత్తుగా మారింది. మద్యం దుకాణాల విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టడం.. వాటిని పక్కాగా అమలు చేస్తుండడం.. దాన్ని ఉల్లంఘనలకు పాల్పడిన వైన్స్ నిర్వాహకులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు భౌతిక దాడికి దిగడం వివాదాస్పదంగా మారుతోంది. వాస్తవానికి మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రక్రియ నుంచి వివాదం నెలకొంటూనే వచ్చింది. దీంతో రూ. లక్షలు పోసి మద్యం దుకాణాలను దక్కించుకున్న నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆంక్షల నేపథ్యంలో వైన్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఎమ్మెల్యే అనుచరులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైన్స్ నిర్వాహకులపై దాడి చేయడం సంచలనంగా మారింది. సిట్టింగ్‌ను సాయంత్రం 6 గంటల కంటే ముందుగా ఓపెన్ చేశారనే కారణంతో ఎమ్మెల్యే అనుచరులు వైన్స్ నిర్వాహకులను మద్యం దుకాణం నుంచి బయటకు లాక్కోచ్చి మరీ దాడి చేయడం వివాదాస్పదమయింది.

నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఆంక్షలు..

మద్యం దుకాణాలు సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తుంటారు. మద్యం దుకాణాల్లో సిట్టింగ్ సైతం అప్పటి నుంచే తెరిచి ఉంటుంది. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో మద్యం దుకాణాలను మధ్యాహ్నాం ఒంటిగంటకు ఓపెన్ చేయడంతో పాటు సిట్టింగ్‌ను మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాతే ఓపెన్ చేయాలంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాలను సైతం ఊరికి దూరంగా ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులను పిలిచి ముందుగానే హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైన్స్ నిర్వాహకులు అమలు చేస్తూ వచ్చారు. అయితే పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడికి పొంతన లేకపోవడం.. ఇతర ప్రాంతాల్లో ఒకలా.. మునుగోడులో ఆంక్షల నడుమ వైన్స్ నడపడం గగనంగా మారుతోంది. ఈ విషయంపై టెండర్లు వేయడానికి ముందే టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులను వైన్స్ నిర్వాహకులు కలిశారు. తెలంగాణ అంతటా ఒకటే రూల్స్ అంటూ ఎక్సైజ్ అధికారులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. కానీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎంతమాత్రం సద్దుమణిగే పరిస్థితి లేదు. పైగా ఎక్సైజ్ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

చండూరులో వైన్స్ నిర్వాహకులపై దాడి..

Munugodu నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ వైన్స్ నిర్వాహకులు సాయంత్రం 6 గంటల కంటే ముందుగా సిట్టింగ్ రూమ్‌ను ఓపెన్ చేశారనే కారణంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాదాపు 30 మంది ఒక్కసారిగా వైన్స్ నిర్వాహకులపై వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రూల్స్ ఎలా ధిక్కరిస్తారంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. వాస్తవానికి మద్యం అమ్మకాలు తగ్గించడం మంచి విషయమే. కానీ మునుగోడులో మాత్రమే ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల వైన్స్ యాజమాన్యాలు నష్టపోవడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలో తరచూ ఇలాంటి ఘటనలతో వైన్స్ నిర్వాహకులను బెంబేలెత్తుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. వైన్స్ నిర్వాహకులపై దాడి చేసినవారిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>