కలం, వెబ్ డెస్క్: ఈవీ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహనాల మెయింటెన్స్ తక్కువగా ఉండటంతో వీటి వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో ఈవీ వాహన రంగంలో పోటీ కూడా అంతే అధికంగా ఉంది. ఒక బ్రాండ్‌ను మించి మరో బ్రాండ్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ సమయంలోనే బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఎంజీ మోటార్స్ నుండి వచ్చిన ‘కామెట్ ఈవీ’ (MG Comet EV) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
నగర ప్రయాణాలకు అనుకూలం
నగర ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉండేలా రూపొందించబడిన ఈ కారు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఈవీలతో పోలిస్తే ధర విషయంలో గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా ఎంజీ ప్రవేశపెట్టిన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BaaS) విధానం వల్ల ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం 4.99 లక్షల రూపాయల నుంచే ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు బ్యాటరీతో సహా కారును పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటే దీని ధర సుమారు 7.50 లక్షల రూపాయల నుండి 9.56 లక్షల రూపాయల వరకు ఉంటుంది. దీనికి పోటీగా ఉన్న టాటా టియాగో ఈవీ ధర 7.99 లక్షల రూపాయల నుండి ప్రారంభమై 11.14 లక్షల వరకు ఉండగా, టాటా పంచ్ ఈవీ ధర 9.69 లక్షల రూపాయల నుండి మొదలవుతుంది. ఈ లెక్కన చూస్తే, మధ్యతరగతి వినియోగదారులకు కామెట్ ఈవీ ఒక చౌకైన, స్మార్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఎన్నో ప్రత్యేక ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే కామెట్ ఈవీ (MG Comet EV) తన ప్రత్యేకమైన డిజైన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో 17.3 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలు కల్పిస్తుంది. కారు లోపల లగ్జరీ అనుభూతిని ఇచ్చేలా 10.25 అంగుళాల సైజులో ఉండే రెండు ఫ్లోటింగ్ డిస్‌ప్లేలు అమర్చారు. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ సమాచారం కోసం పనిచేస్తాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు 55కు పైగా ‘ఐ-స్మార్ట్’ కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సిటీలో ఇరుకైన సందుల్లో కూడా కారును సులభంగా తిప్పడానికి కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటం దీనికి ఉన్న అతిపెద్ద బలం.
భద్రత విషయంలో నో కాంప్రమైజ్
భద్రత , ఇతర సౌకర్యాల విషయంలో కూడా ఈ కారు ఎక్కడా తగ్గలేదు. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ బ్లూ టూత్ కీ సౌకర్యం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌నే కారు కీలా మార్చుకోవచ్చు. టియాగో ఈవీ వంటి కార్లు మరికొంత ఎక్కువ రేంజ్, ఐదుగురు కూర్చునే సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, సిటీ డ్రైవింగ్ కోసం స్మార్ట్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్, తక్కువ బడ్జెట్ కోరుకునే వారికి కామెట్ ఈవీ కచ్చితంగా ఒక పర్ఫెక్ట్ కారుగా నిలుస్తుంది. ఇన్ని ఫీచర్లు, ఇంత తక్కువ ధరలో లభించడం వల్లే ప్రస్తుత ఈవీ మార్కెట్లో కామెట్ ఈవీ ప్రత్యేకతను సంతరించుకున్నది.
Read Also: తెలంగాణకు వాతావరణ హెచ్చరిక.. ఎండలు, ఆపై భారీ వానలు
Follow Us On: Instagram

