కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయ వర్గాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham), టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చినరాజప్పతో భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని చెబుతున్నప్పటికీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పరస్పర రాజకీయ భిన్న ధృక్పథాలతో ఉన్న ఈ ఇద్దరి కలయిక అనేక ఊహాగానాలకు తెరలేపుతోంది.
గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనను పరామర్శించేందుకు చినరాజప్ప (MLA Chinarajappa) వెళ్లారు. అయితే వైద్యుల సూచన మేరకు అప్పట్లో ముద్రగడను కలిసే అవకాశం చినరాజప్పకు దక్కలేదు. ఈ విషయం తెలుసుకున్న ముద్రగడ తాజాగా స్వయంగా చినరాజప్ప క్యాంపు కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని, కేవలం కుటుంబం, ఆరోగ్య పరిస్థితులు వంటి వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడుకున్నారని చినరాజప్ప వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భేటీ పూర్తిగా మర్యాదపూర్వకమేనని వారు చెబుతున్నారు.
ముద్రగడ పద్మనాభం నేపథ్యం దృష్టిలో ఉంచుకుంటే ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతగా పేరున్న ముద్రగడ, గతంలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమం ఒక దశలో హింసాత్మక రూపం దాల్చింది .
అదే సమయంలో ముద్రగడకు (Mudragada Padmanabham) వైసీపీ మద్దతుదారుడన్న ముద్ర ఉంది. వైసీపీ అధినేత జగన్‌కు అనుకూలంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చెందిన పార్టీ ఎమ్మెల్యేతో ముద్రగడ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని కొందరు కేవలం వ్యక్తిగత భేటీ అంటున్నారు. మరికొందరు దీని వెనుక లోతైన రాజకీయ అర్థాలున్నాయా అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? కాపు సామాజికవర్గ రాజకీయాల్లో కొత్త చర్చలకు ఇది ఆరంభమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటువైపు ఉంటాయి? ఆయన టీడీపీకి మద్దతు ఇవ్వబోతున్నారా? అన్న చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
Read Also: ప్రధాని ప్రశంసించిన ‘అనంత నీరు సంరక్షణం’.. ఆ ఇద్దరి కృషే
Follow Us On: Instagram


