కలం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి రావడం వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయేమోనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ (MLA Sriganesh) అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని.. ఇక్కడ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. పవన్ పర్యటన వెనుక ఆ రెండు పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించి అశాంతిని సృష్టించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న నాయకుడికి ఇది తగదని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పద అంశాలను లేవనెత్తడం సరైన విధానం కాదన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం కంటే అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు సాగుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ, సామాజిక విభేదాలకు ఆస్కారం కల్పించే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతలు కీలక పదవిలో ఉన్న నాయకులు తమ వ్యాఖ్యల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, సమాజంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే రాజకీయ వ్యాఖ్యలను సరికాదని ఎమ్మెల్యే (MLA Sriganesh) పేర్కొన్నారు.
Read Also: ఇండోనేషియా ఓపెన్ నుంచి సాత్విక్ – చిరాగ్ జోడీ అవుట్
Follow Us On: Sharechat

