వరంగల్‌లో రౌడీ రాజకీయం!.. గ్రూపు తగాదాల్లో కాంగ్రెస్ కార్యకర్త బలి

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) లో ఒకే రోజు రెండు ఘటనలు శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తపై రౌడీషీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మరోవైపు హనుమకొండ బాలసముద్రంలో ఓ వ్యక్తిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి జరిగిన ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. రెండు ఘటనలు రౌడీయిజం, గ్రూపు రాజకీయాలు, భూ వివాదాలు, సెటిల్‌మెంట్లపై మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాంగ్రెస్ కార్యకర్త హత్యతో కలకలం

ఏనుమాముల మార్కెట్ పీఎస్ పరిధిలో శనివారం జరిగిన ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త అడుప మహేష్‌పై రౌడీషీటర్ పత్తి కుమార్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ సుమారు 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా వినిపిస్తున్న కథనాల మేరకు.. మహేష్‌కు నిందితుడు కుమార్‌తో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకే పార్టీలో క్రియాశీలకంగా ఉండగా, తన రాజకీయ ఎదుగుదలకు మహేష్ అడ్డుపడుతున్నాడనే అనుమానంతోనే కుమార్ దారుణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భూ వివాదాలు.. సెటిల్‌మెంట్లు!

వరంగల్ సిటీలో భూ వివాదాలు, సెటిల్‌మెంట్‌లు, రాజకీయ ఆధిపత్య పోరు నేపథ్యంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మళ్లీ చెలరేగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో రౌడీషీటర్లు భూదందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస కాలనీలో ప్రభుత్వ భూమి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఘటన సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దాడికి పాల్పడిన వారిపై ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, అదే నిర్లక్ష్యం కారణంగా వారు మరింత రెచ్చిపోయారని ఆరోపిస్తున్నారు.

రాజకీయ ఆశ్రయంపైనా విమర్శలు

వరుస ఘటనల నేపథ్యంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు రాజకీయ ఆశ్రయం లభిస్తోందనే విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి. స్థానికంగా జరిగే గ్రూపు తగాదాలు, భూ వివాదాల గురించి రాజకీయ నేతలకు ఎప్పటికప్పుడు తెలిసినా కానీ అరికట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహేష్ మృతిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

పోలీసుల తీరుపై ప్రశ్నలు

మరోవైపు పోలీసుల పనితీరుపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం వరుస ఘటనలతో వరంగల్‌లో నేరాల నియంత్రణ, రాజకీయ జోక్యం, పోలీసుల అప్రమత్తత వంటి అంశాలు మరోసారి ప్రధాన చర్చగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>