కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్రంగా స్పందించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బర్మింగ్‌హామ్‌లో తొలి వన్డే గెలిచిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఈ ఫలితం అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లను కూడా గుర్తు చేసింది. ఐర్లాండ్ చేతిలో 0-2, ఇంగ్లండ్ చేతిలో 0-4తో భారత్ ఘోర పరాజయాలు చవిచూసింది. మొత్తం యూకే పర్యటనలో 10 వైట్‌బాల్ మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది ఒక్కటే.
కోచ్ బాధ్యత వహించాల్సిందే..
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ విజయాల మధ్య ఈ ఓటములు మర్చిపోతారని అన్నాడు. కానీ ఈ ఫలితాలకు గంభీర్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌లో ఇలాంటి విషయాలు ఎక్కువగా పట్టించుకోరని, చివరికి అన్నీ దాచిపెడతారని వ్యాఖ్యానించాడు. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ పలు సిరీస్‌లు కోల్పోయిందని గుర్తు చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో వన్డే సిరీస్‌లు చేజారాయని చెప్పాడు.
అప్పుడు మర్చిపోతారు..
న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఓటమి కూడా జరిగిందని పేర్కొన్నాడు. అలాగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌లు ఎదురైన విషయాన్ని ప్రస్తావించాడు. రాబోయే జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక సిరీస్‌ల్లో గెలిస్తే.. ఈ ఇంగ్లండ్ పర్యటనను అందరూ మర్చిపోతారని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. అలాంటి విజయాలతో మేనేజ్‌మెంట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందనే ప్రచారం జరుగుతుందని అన్నాడు.
వాళ్లను ఎందుకు పక్కన పెట్టారు..
సెలక్షన్లపై కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇష్టమైన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తున్నారని విమర్శించాడు. భారత్ తదుపరి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి హరారేలో ప్రారంభం కానుంది.

