పోలీస్ స్టేషన్‌లోనే రెచ్చిపోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి!

​కలం, ఖమ్మం బ్యూరో : రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే రక్తం చిందింది. కుటుంబ కలహాల పరిష్కారం కోసం స్టేషన్‌కు వచ్చిన భార్యపై, ఓ భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ సంఘటన ఖమ్మం (Khammam) జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు చూస్తుండగానే భర్త రెచ్చిపోయి కిరాతకానికి తెగబడటంతో పీఎస్ ప్రాంగణం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

​సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రాంబాబు, భూక్యా రజని దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. భర్త రాంబాబు మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో తట్టుకోలేక రజని గత రెండేళ్లుగా అతనికి దూరంగా కారేపల్లి లో ఉంటోంది. ఈ క్రమంలో డ్వాక్రా రుణం చెల్లించే నిమిత్తం రజని సోమవారం ఏన్కూరులోని బ్యాంకుకు వచ్చింది.

ఆ విషయం తెలుసుకున్న రాంబాబు అక్కడికి చేరుకుని ఆమెతో తీవ్రంగా గొడవపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను ఏన్కూరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ​స్టేషన్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలోనే రాంబాబు ముందస్తు పథకం ప్రకారం భార్య రజనిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఊహించని పరిణామానికి పోలీసులు, అక్కడున్న స్థానికులు స్తంభించిపోయారు. ఈ దాడిలో రజని కుడి భుజం, మణికట్టు ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

​గాయపడిన రజనిని పోలీసులు వెంటనే ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన నిందితుడు రాంబాబును పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చట్టాన్ని రక్షించే పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఈ తరహా హత్యాయత్నం జరగడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>