కరవులోనూ రికార్డు సాగు.. సంగారెడ్డి సీక్రెట్ ఇదే!

క‌లం, మెద‌క్ బ్యూరో : ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సాగు చేయాలంటే రైతన్న వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ అత్యధిక స్థాయిలో ఏకంగా 81 శాతం మేర సాగు (Sangareddy Agriculture)ను ప్రారంభించారు రైతులు. వేరే జిల్లాల్లో సాధ్యంకాని విధంగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సాగు ఎలా సాధ్యమైంది? ప్రత్యామ్నాయ పంట సాగును ఎంచుకున్న సంగారెడ్డి జిల్లా రైతులు చెబుతున్నదేమిటి?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో (El Nino) ప్రభావం వలన లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ దాదాపు డెడ్ స్టోరేజికి చేరుకొని ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల్లో అంతంత మాత్రంగానే నీటి నిల్వలు ఉండటంతో పంటల సాగు చేయాలంటే రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితేగాని విత్తనాలు వేయకూడదని నిర్ణయించుకున్నారు రైతులు. దీంతో జూలై 14 నాటికి తెలంగాణ రాష్ట్ర సగటు సాగు కేవలం 45 శాతంగా మాత్రమే ఉన్నది.

అయినప్పటికీ, సంగారెడ్డి జిల్లా రైతులు ఏకంగా 81 శాతానికి పైగా వ్యవసాయ భూముల్లో విత్తనాలు నాటడం పూర్తి చేశారు. ఎల్ నినో నేపథ్యంలోనూ సంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు (Sangareddy Agriculture) చేయడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా రైతులు కేవలం వరి పైనే ఆధారపడకుండా, వాణిజ్య పంటలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. వరి సాగు తగ్గినా.. పత్తి, కంది, సోయాబీన్, చెరకు, మొక్కజొన్న వంటి వివిధ రకాల పంటలను ఇక్కడ భారీగా వేస్తారు.

సంగారెడ్డి జిల్లాలో ఉన్న నేలల స్వభావం, నీటి వనరుల వల్ల వైవిధ్యభరితమైన పంటలను సాగు చేస్తుంటారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా వివిధ రకాల పంటల సాగు చేస్తుంటారు. సంగారెడ్డిలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 121.3 ఎంఎం కాగా, ఈ ఏడాది జూన్ నెలలో 131.2 ఎంఎం వర్షం కురిసింది. దీంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సకాలంలోనే రుతుపవనాల రాకతో వ్యవసాయ పనులు ప్రారంభించి, విత్తనాలను వేశారు. అయితే జూలైలో ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాలో 54 శాతం మేర వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, జూన్‌లో కురిసిన వర్షాల వల్ల పంటలు తట్టుకోగలిగాయి.

వాణిజ్య పంటల సాగుకు ప్రసిద్ధి

సంగారెడ్డి జిల్లాలో విభిన్న నేలల స్వభావం ముఖ్యంగా నల్లరేగడి, చల్కా నేలలు వాణిజ్య పంటల సాగుకు అనువుగా ఉంటాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ వంటి ప్రాంతాల్లోని నేలలు పత్తి, కంది, అల్లం, ఆలుగడ్డ మరియు సోయాబీన్ పంటలకు ఎంతో అనుకూలమైనవి. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 7.57 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 6.04 లక్షల ఎకరాల్లో (81శాతం) వివిధ పంటల సాగును మొదలుపెట్టారు.

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 3.56 లక్షల ఎకరాల్లో పత్తి, 72,000 ఎకరాల్లో కంది, 70,000 ఎకరాల్లో సోయాబీన్, 34,945 ఎకరాల్లో చెరకు, 7,364 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వీటితో పాటు పెసలు, మినుములు కూడా గణనీయమైన విస్తీర్ణంలో సాగయ్యాయి. జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగు అవ్వగా, ఈసారి కేవలం 20,000 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు.

సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ ఏడాది ఆయకట్టు కింద సాగునీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సింగూరు ఆయకట్టు, మంజీరా నది పరివాహ ప్రాంతాల్లో ఎక్కువగా వరి పండిస్తారు. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా నీరు అందితేనే రైతులు వరి సాగును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయ పంటలే దిక్కు

సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ఆటంకం లేకుండా రైతులు సాగు చేస్తుంటే, ఉమ్మడి జిల్లా భాగంగా ఉన్న మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పంటల సాగుతీరు భిన్నంగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సగటు సాగు 45 శాతం కంటే తక్కువగా సాగు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కేవలం 14 శాతం, సిద్దిపేట జిల్లాలో 24 శాతం మాత్రమే సాగు పూర్తయింది. వనపర్తి జిల్లా తర్వాత రాష్ట్రంలో అతితక్కువ సాగు మెదక్ జిల్లాలో కనిపిస్తోంది.

సాధారణంగా మెదక్ జిల్లాలో కొంచెం ఆలస్యంగా జూలై చివరి వారం నుండి పంటల సాగు చేస్తుంటారు. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో పాటు సింగూరు ప్రాజెక్టు నుండి కిందికి నీటిని వదిలితే మంజీరా పరివాహ ప్రాంతాలు, ఘనపురం ప్రాజెక్టు వలన నీళ్లు వస్తే, పంటల సాగు అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు లేకపోయినా.. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం వేచిచూసి వర్షాలు పడితే మళ్లీ వరి సాగు చేయాలనే ఆలోచన చేస్తున్నారు రైతులు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరికి బదులుగా కంది, పెసలు, మినుములు, సోయాబీన్, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. నేలల స్వభావం, వర్షపాతం ఆధారంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని, కేవలం వరి పంట వేస్తామని అనుకుంటే నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

Read Also: అడవిని గెలిపించిన జనం: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>