కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాలలో నిరసన దీక్ష పేరుతో ఎంపీ అరవింద్ రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) విమర్శించారు. జగిత్యాల (Jagtial) పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ ధర్మపురి (Dharmapuri Arvind) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేనేం పాపం చేశాను, నన్నెందుకు జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ స్థలం విషయంలో ఎంపీ అరవింద్ బద్నామ్ చేస్తున్నారు” అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ స్థల విషయంలో తనను దోషిగా నిలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మండిపడ్డారు. స్థలం కేటాయింపు విషయంలో పలుమార్లు సంబంధిత మంత్రులను, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ కావాలనే ఎంపీ అరవింద్ (MP Arvind) ఈ విషయంలో తనను దోషిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని విమర్శలు చేస్తున్న అరవింద్ 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎందుకు ఒక్క బ్రిడ్జి నిర్మాణం కూడా చేయలేదని నిలదీశారు. కేంద్రీయ విద్యాలయ స్థల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌ను పలుమార్లు కలిసి విన్నవించానని స్పష్టం చేశారు. అయితే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. నియోజకవర్గం టీఆర్ నగర్ (TR Nagar) లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వెల్లడించారు.
Read Also: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రాధా పండిట్ నియామకం రద్దు!
Follow Us On: Sharechat

