కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ (CPI) మాజీ జిల్లా అధ్యక్షులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పరమేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్నగర్ (Mahabubnagar) పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్లో అతి తక్కువ నిధులు కేటాయిస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభాలు గడిచే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో, ఉచిత విద్యని అందించడంలో పాలకులు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మనువాద, సనాతన విద్యను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన కొఠారి కమిషన్ నివేదిక ఇచ్చి 60 ఏండ్లు అవుతున్న అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అన్నారు. అందుకే విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు సమరశీల పోరాటాలకై సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
1936 ఆగస్టు 12న ఏర్పడిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య దేశంలోనే తొలి జాతీయ స్థాయి విద్యార్థి సంఘంగా, విద్యార్థి ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసిందన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి విద్యార్థుల సమస్యలతో పాటు దేశ స్వాతంత్ర్యం పోరాటంలో, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి దేశభక్తి ఉద్యమాలకు ఏఐఎస్ఎఫ్ బలమైన పునాది వేసిందన్నారు.
స్వాతంత్ర్యం అనంతరం కూడా విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, పేద విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. విద్య అందరికీ సమానంగా అందాలి, విద్యపై ప్రభుత్వ బాధ్యత పెరగాలి, పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించాలనే అంశాలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం ఉద్యమాలు చేసిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఏఐస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిందన్నారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ విద్యార్థుల సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి, విద్యా అవకాశాల కోసం పోరాటాలు సాగించిందన్నారు. ఫీజుల పెంపు, నిరుద్యోగం, ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలు, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై నిరంతరం పోరాడుతోందన్నారు.
నేటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ఏఐఎస్ఎఫ్ తన చారిత్రక పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పరమేశ్వర్ అన్నారు. 91 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ దేశ విద్యార్థి ఉద్యమానికి ఒక చారిత్రక వారసత్వమని, ఆ వారసత్వాన్ని నేటి తరం విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని పరమేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, నాయకులు శేఖర్, నరసింహ, భరత్, అశోక్, అజయ్, మహేష్, నాని, కార్తీక్, శ్రీహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

